IndiGo: దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం తీవ్రం.. పలు ఎయిర్‌పోర్టుల్లో విమానాల రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండిగో విమానాల రద్దు సంక్షోభం (IndiGo Crisis) పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. నేడు కూడా దేశంలోని పలు ఎయిర్‌పోర్టుల్లో ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. ముంబయి నుంచి కోల్‌కతా, నాగ్‌పూర్, భోపాల్‌కు వెళ్లాల్సిన మూడు విమానాలు రద్దయ్యాయి. శ్రీనగర్-అమృత్‌సర్ రూట్‌లో రెండు సర్వీసులు నిలిచిపోయాయి. తిరుచ్చిలో ఐదు అరైవల్స్, ఆరు డొమెస్టిక్ డిపార్చర్లు రద్దయ్యాయి. తిరువనంతపురం, దిల్లీ సహా మరికొన్ని ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో కూడా ఇండిగో సర్వీసులు నిలిచిపోయాయి. బెంగళూరులో మొత్తం 150 విమానాలు- 76 అరైవల్స్, 74 డిపార్చర్లు- రద్దయ్యాయి. హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా 100కు పైగా సర్వీసులు ఆగిపోయాయి. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ముంబయి ఎయిర్‌పోర్టులో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసింది.
Details
ఇవాళ 1500 సర్వీసులు నడపనున్నట్లు సమాచారం
ఇది ప్రత్యామ్నాయ ప్రయాణాలు, టికెట్ బుకింగ్స్ కోసం ప్రయాణికులకు సాయం చేస్తోంది. ఇండిగో నేడు దాదాపు 1500 విమాన సర్వీసులను నడపనున్నట్లు అంచనా వేసింది. ఈ సంక్షోభాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్న డీజీసీఏ(DGCA) ఇప్పటికే ఇండిగోపై చర్యలు ప్రారంభించింది. సంస్థ సీఈవో, సీవోవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సీఈవో పీటర్ ఎల్బెర్స్ విధి నిర్వహణలో, ప్రణాళికలో ఘోర వైఫల్యం చోటుచేసుకున్నట్లు డీజీసీఏ పేర్కొంది. ఇదిలా ఉండగా, రవాణా-పర్యాటక రంగ పార్లమెంటరీ కమిటీ కూడా ఇండిగోతో పాటు ఇతర ఎయిర్‌లైన్స్‌లకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇండిగో సంక్షోభాన్ని ఉపయోగించుకుని, ఇతర విమాన సంస్థలు ఒక్కసారిగా టికెట్ ధరలు పెంచి ప్రయాణికులపై భారం మోపిన అంశంపై ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం.