Indigo flight: గాల్లో ఉండగానే ఇండిగో విమానం ఇంజిన్ ఫెయిల్.. చెన్నైలో ఎమర్జెన్సీ
ఈ వార్తాకథనం ఏంటి
కోల్‌కతా నుంచి చెన్నై వస్తున్న ఇండిగో విమానానికి మంగళవారం అర్ధరాత్రి అత్యవసర పరిస్థితి ఎదురైంది. విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఎడమవైపు ఇంజిన్ పనిచేయకుండా పోయింది. దీంతో చెన్నై విమానాశ్రయంలో అధికారులు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన సిబ్బంది విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. 224 మంది ప్రయాణికులతో ఇండిగో విమానం కోల్‌కతా నుంచి చెన్నైకి బయల్దేరింది. రాత్రి 11.30 గంటలకు చెన్నైలో ల్యాండ్ కావాల్సి ఉంది. గమ్యస్థానానికి చేరుకుని ల్యాండింగ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఎడమవైపు ఇంజిన్‌లో సమస్య తలెత్తినట్లు పైలట్ గుర్తించారు.
వివరాలు
ఎమర్జెన్సీ ప్రకటించిన ఏడు నిమిషాలకే..
వెంటనే పైలట్ చెన్నై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించారు.
పరిస్థితి తీవ్రతను గుర్తించిన అధికారులు విమానం సురక్షితంగా దిగేందుకు వీలుగా చెన్నై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు.
అవసరమైన అత్యవసర ఏర్పాట్లతో విమానం ల్యాండింగ్‌కు అధికారులు సిద్ధమయ్యారు.
ఎయిర్‌పోర్ట్ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎమర్జెన్సీ ప్రకటించిన ఏడు నిమిషాలకే విమానం సురక్షితంగా రన్‌వేపై దిగింది.
దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన మరో పది నిమిషాల తర్వాత అత్యవసర పరిస్థితిని ఉపసంహరించారు.
అనంతరం చెన్నై విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి.