IndiGo Flights: మూడు రోజులుగా విమాన రద్దులు.. ఇండిగో ప్రయాణికుల కష్టాలు వర్ణనాతీతం
ఈ వార్తాకథనం ఏంటి
ఇండిగో విమాన ప్రయాణికుల పరిస్థితి ఈ మధ్య చాలా దయనీయంగా మారింది. గత రెండు మూడు రోజులుగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో అనేక మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే అవస్థలు పడుతున్నారు. ఇంటికి చేరలేని పరిస్థితి ఒక వైపు, ప్రయాణం ముందుకు సాగని పరిస్థితి మరో వైపు ఎదురవడంతో గంటలకొద్దీ ఎయిర్‌పోర్టుల్లోనే ఎదురుచూస్తున్నారు. ఎప్పుడైనా సర్వీసులు తిరిగి ప్రారంభమవుతాయేమో అన్న ఆశతో అక్కడే నిరీక్షిస్తున్నారు. కానీ వారిని పరామర్శించే వారే లేరనే పరిస్థితి నెలకొంది. భోజనం, విశ్రాంతి సరైన ఏర్పాట్లు లేక అక్కడే ఉండిపోవాల్సి వస్తోంది. ఈ దుర్గతిని చూపించే ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.
వివరాలు
మొత్తం 500 విమానాల్ని రద్దు చేసినట్లు సమాచారం
మూడు రోజులుగా ఇండిగో విమాన రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ప్రారంభంలో కొద్దిమాత్రంలో సర్వీసులు రద్దవ్వగా... ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 500 కు చేరుకుంది. మొత్తం 500 విమానాల్ని రద్దు చేసినట్లు సమాచారం. అత్యవసరంగా ప్రయాణించాలనుకున్న వారికి ఇది నిజంగా పెద్ద కష్టంగా మారింది. టికెట్లు తీసుకుని ఎయిర్‌పోర్టులకు వచ్చిన తర్వాత సర్వీసులు లేవని తెలిసి ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. విమానాశ్రయాల్లో ఎక్కడ చూసినా ప్రయాణికులతో కూడిన బారులు, చెల్లాచెదురుగా పడేసిన సూట్‌కేసులు, వాటర్ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. చాలామంది నేలపై పడుకుని విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోంది. మరి కొందరు ఈ వ్యవహారంపై ఆగ్రహంతో నిరసనలకు దిగుతున్నారు. ఇంకొందరు ఎయిర్‌లైన్ సిబ్బందితో వాగ్వాదానికి పడుతున్నారు.
వివరాలు
చెత్త ఎయిర్‌లైన్
12 గంటలకు పైగా వేచి ఉన్నప్పటికీ తమకు ఎటువంటి అధికారిక సమాచారం అందలేదని ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతి సారి కేవలం గంట ఆలస్యం... మరో రెండు గంటలు ఆలస్యం అంటూ మాత్రమే చెబుతున్నారని వాపోయాడు. ఓ వివాహానికి వెళ్లేందుకు బయలుదేరి ఇలా మధ్యలోనే ఇరుక్కుపోయామని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండిగో సేవలను తీవ్రంగా విమర్శిస్తూ చెత్త ఎయిర్‌లైన్ అంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం దాదాపు అందరూ ఇదే విధంగా అసంతృప్తి, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.