
Indiramma House: ఇందిరమ్మ ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగుల విస్తీర్ణంలోపే..
ఈ వార్తాకథనం ఏంటి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ఒక కొత్త నిబంధనను అమలు చేస్తున్నది.
ఇంటి విస్తీర్ణం తప్పకుండా 400 చదరపు అడుగులు నుండి 600చదరపు అడుగుల మధ్యలో ఉండాలని షరతు విధించడంతో,అనేకమంది లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడతగా 70,122 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఇందులో ఇప్పటివరకు 2,830 మంది లబ్ధిదారులు పునాది పనులు పూర్తిచేశారు. అయితే,సుమారు 280 మందికిపైగా 600 చదరపు అడుగుల పరిమితిని మించి నిర్మాణం చేపట్టినట్లు గుర్తించిన అధికారులు, వారి మొదటి విడత బిల్లులుగా ఇచ్చే లక్ష రూపాయలను ఆపేశారు.
ప్రభుత్వ నిబంధనల మేరకు పునాదిలో మార్పులు చేసి,పరిమితిలోకి తీసుకువచ్చిన తర్వాతే బిల్లులు మంజూరు చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
వివరాలు
ఒక మాట.. మరొక పని..! లబ్ధిదారుల కలవరానికి కారణం
ప్రారంభంలో, సొంత స్థలమున్న లబ్ధిదారులు తమకు అనుకూలమైన విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం చేసుకోవచ్చని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
అలాగే, ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు అందించనున్నట్టు ప్రకటించింది.
మోడల్ ఇళ్ల నమూనాలను చూపించినప్పటికీ, నిర్మాణ పరిమితిపై ఎటువంటి ప్రత్యేక నిబంధనలు విధించబోమని వెల్లడించింది.
అయితే ఇప్పుడు, అధికారులు ఇంటి విస్తీర్ణం తప్పకుండా 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యలో ఉండాలని పదేపదే చెబుతున్న విషయం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
వివరాలు
షరతులు విధించడం సరికాదు
లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పాటు అదనంగా స్వంతంగా ఖర్చు చేయడం జరుగుతున్నదని పేర్కొంటున్నారు.
అలాంటప్పుడు ఇప్పుడు కొత్తగా పరిమితి షరతులు విధించడం సరికాదని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు 600 చదరపు అడుగులను మించిన ఇంటిని బీపీఎల్ (బెలో పొవర్టీ లైన్) పరిధిలోకి రారని చెబుతున్నారు.
హౌసింగ్ శాఖ వివరాల ప్రకారం, మొదట పేదల ఇళ్లు 400 చదరపు అడుగుల్లోనే నిర్మించాల్సిందిగా ఉద్దేశించినప్పటికీ, ఇప్పుడు అదనంగా 200 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని అనుమతించినట్లు వెల్లడించారు.
వివరాలు
రెండో జాబితా విడుదలకు ముహూర్తం
ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితాను మే 5వ తేదీన ప్రకటించే అవకాశముందని సమాచారం.
ఈ నేపథ్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి నిర్మాణ పరిమితి 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్యలో ఉండాలని జిల్లా అధికారులను గృహ నిర్మాణశాఖ ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలిసింది.
ఈ నిబంధనను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.