Loading...
Indiramma Life Insurance Scheme: తెలంగాణలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం.. ఈ నెల 19 నుంచి ప్రారంభం
తెలంగాణలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం.. ఈ నెల 19 నుంచి ప్రారంభం

Indiramma Life Insurance Scheme: తెలంగాణలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం.. ఈ నెల 19 నుంచి ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 19న తెలంగాణలో ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సిద్దిపేటలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని, అదే రోజు నుంచి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. అలాగే ఇందిరమ్మ చీరల రెండో విడత పంపిణీని కూడా అదే రోజు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతులకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక ప్రభుత్వానికి అందిందని మంత్రి తెలిపారు. ఈ నివేదికపై మంత్రిమండలిలో సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. ప్రాజెక్టుల మరమ్మతులను పారదర్శకంగా చేపట్టి, తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.

వివరాలు 

రేవంత్‌రెడ్డి అధ్యక్షతన 38వ మంత్రిమండలి సమావేశం

ప్రభుత్వంలోని వివిధ శాఖల అవసరాల కోసం ఏడు ప్రాంతాల్లో రెవెన్యూ భూముల బదిలీకి, పలు కొత్త పోస్టుల భర్తీకి కూడా మంత్రిమండలి ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన 38వ మంత్రిమండలి సమావేశం జరిగింది.

ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.

సమావేశం అనంతరం మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, వాకిటి శ్రీహరితో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడారు.

ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్ ఉందని, వివిధ వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో ఈ రెండు వర్గాలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించినట్లు వివరించారు.

వివరాలు 

రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం

డిసెంబరు 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026 నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.

ఈ కార్యక్రమానికి దేశవిదేశాలకు చెందిన వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు వందల సంఖ్యలో హాజరుకానున్నారని చెప్పారు.

ఈ ఏడాది ప్రపంచ దేశాల నుంచి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం పూర్తి విశ్వాసంతో ఉందన్నారు.

గత మూడేళ్లుగా రైజింగ్ తెలంగాణ పేరుతో రాష్ట్రంలో పలు కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.

పారిశ్రామిక విధానాలతో పాటు ఇతర సరళీకృత విధానాలను సమన్వయం చేస్తూ, ప్రపంచంలోని ఇతర దేశాలు, రాష్ట్రాలతో పోటీపడేలా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు 

కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు గ్రీన్ సిగ్నల్

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) సూచించిన అన్ని పరీక్షలను ప్రభుత్వం పూర్తి చేసిందని పొంగులేటి తెలిపారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో పునాది నిర్మాణంలో లోపాలు ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారని చెప్పారు.

కటాఫ్ వాల్స్ నిర్మాణం సరిగా లేకపోవడంతో పాటు స్పిల్‌వే వెడల్పు కూడా నిబంధనలకు అనుగుణంగా లేదని వివరించారు.

ఎగువ ప్రాంతంలో కాంక్రీట్ డయాఫ్రమ్ వాల్ లేకపోవడంతో బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయవద్దని గతంలో ఎన్‌డీఎస్‌ఏ ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేశారు.

ADVERTISEMENT

వివరాలు 

కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులకు గ్రీన్ సిగ్నల్

ఈ ఆదేశాల ప్రకారం ప్రభుత్వం అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహించి, వాటికి సంబంధించిన వివరాలను ఎన్‌డీఎస్‌ఏకు అందజేసిందన్నారు.

ఆ సంస్థ సూచనల మేరకు పరీక్షల నివేదికలను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కి కూడా సమర్పించినట్లు తెలిపారు.

ప్రాజెక్టులను ఏ విధంగా మరమ్మతు చేయాలి? అనుసరించాల్సిన విధివిధానాలు ఏమిటి? భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలి? అనే అంశాలతో కూడిన నివేదిక తాజాగా అందిందని చెప్పారు.

ఈ నివేదికపై మంత్రిమండలి విస్తృతంగా చర్చించిందని, పారదర్శకంగా మరమ్మతులు చేపట్టి ప్రాజెక్టులను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించిందని వెల్లడించారు.

వివరాలు 

ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమం

దీపావళి పండగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు పొంగులేటి తెలిపారు.

ఈ నెల 7, 8, 9తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో పర్యటించనున్నారని చెప్పారు.

ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని వివరించారు.

కొడంగల్‌లో మెగా రైతు మేళా,పారిశ్రామిక ఎక్స్‌పో నిర్వహించనున్నారు. ఈ నెల 9న అక్కడ భారీ రైతు బహిరంగ సభ కూడా జరగనుంది.

దీపావళి రోజున ముఖ్యమంత్రి నుంచి గ్రామ సర్పంచ్ వరకు ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని ఒక ఇందిరమ్మ ఇంట్లో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలివిడతలో మంజూరైన గృహాల్లో ఇప్పటివరకు 2.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని మంత్రి వెల్లడించారు.

వివరాలు 

ప్రభుత్వ శాఖల్లో 1,199 కొత్త పోస్టులు

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కొత్తగా 1,199 పోస్టుల మంజూరుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

ఇందులో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో 886 పోస్టులు, ఫుడ్ సేఫ్టీ విభాగంలో 177 పోస్టులు, న్యాయశాఖలో 136 పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సంబంధిత శాఖలను మంత్రివర్గం ఆదేశించినట్లు పొంగులేటి వివరించారు.

వివరాలు 

కరవుపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు

రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు త్వరలో శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని మంత్రిమండలి నిర్ణయించింది.

ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన కరవు పరిస్థితులు, తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో అనుసరించాల్సిన జాగ్రత్తలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు.

ఈ ప్రత్యేక సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపైనా సుదీర్ఘంగా చర్చించాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో కరవు పరిస్థితులకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ భారాస చేస్తున్న ఆరోపణలను అసెంబ్లీ వేదికగా సమర్థంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో త్వరలోనే ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుకు సీఎం సూచించినట్లు తెలిసింది.

ADVERTISEMENT