INDIA Bloc: మమతా బెనర్జీకి పరోక్ష మద్దతు.. విపక్ష పార్టీల్లో కొత్త చర్చలకు ముడిపెడుతున్న లాలూ!
విపక్ష 'ఇండియా' కూటమిలో నాయకత్వ మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి క్రమంగా మరింత మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచే ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ సైతం తాజాగా ఈ మార్పుకు అంగీకార సూచనలిచ్చారు. పట్నాలో మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ ఇండియా కూటమిని సమర్థవంతంగా నడిపే సామర్థ్యం కలిగిన నాయకురాలు. ఆమెకు నాయకత్వం ఇవ్వాలని లాలూ వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన చూపినా, హరియాణా, మహారాష్ట్ర ఎన్నికల్లో విఫలమవ్వడం నాయకత్వ మార్పుపై భాగస్వాముల దృష్టిని మరల్చింది. ఈ క్రమంలో మమతా బెనర్జీ ఇటీవలే ఆక్రమిస్తే, తాను నాయకత్వానికి సిద్ధమని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
స్పందించని కాంగ్రెస్
సమాజ్‌వాదీ పార్టీ, ఎన్సీపీ, శివసేన (యూబీటీ) నేతలు ఈ ప్రతిపాదనకు మద్దతు ప్రకటించారు. ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ కూడా నిర్ణయం ఏకగ్రీవంగా ఉండాలని పేర్కొన్నారు. ఇండియా కూటమిలో అగ్రస్థానంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఈ మార్పుపై ఓపెన్‌గా స్పందించకుండా, లోపల చర్చలు జరుపుతోంది. పార్టీలోని ఎంపీలకు రాహుల్ గాంధీ సూచిస్తూ ఇండియా కూటమి వ్యవహారాలను చక్కదిద్దే సామర్థ్యం కాంగ్రెస్‌కు ఉందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇండియా కూటమిలో భాగస్వామి కాని వైఎస్‌ఆర్‌సీపీ నేత విజయసాయిరెడ్డి మమత సారథ్యాన్ని సమర్థిస్తూ 42 లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మమత కూటమిని నడిపించడానికి సరైన వ్యక్తి అని వ్యాఖ్యానించడం విశేషం.
ఇండియా కూటమి వైపుగా వైఎస్ఆర్‌సీపీ?
ఇది వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి విపక్ష కూటమి వైపు సానుకూలంగా అడుగు వేయడానికి చేసిన ప్రాథమిక ప్రయత్నంగా భావిస్తున్నారు. ఇండియా కూటమి నాయకత్వంపై ప్రతిపక్ష పార్టీల మధ్య చర్చలు మరింత వేగవంతమవుతున్నాయి. శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ నాయకత్వ మార్పుపై అన్ని పార్టీలు కలిసి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. సమర్థత, ధృడమైన నాయకత్వం ఉన్నట్లు గుర్తింపు పొందిన మమత బెనర్జీ సారథ్యం విపక్ష పార్టీలను ఆకట్టుకుంటోంది. అయితే కాంగ్రెస్ సహా మరికొన్ని ప్రధాన పార్టీలు ఈ ప్రతిపాదనను ఎలా స్వీకరిస్తాయనేది కూటమి భవిష్యత్తు మార్గదర్శకంగా నిలుస్తుంది.