INS Ikshak: 80% స్వదేశీ సాంకేతికతో.. దేశ రక్షణలో కొత్త అధ్యాయం.. INS ఇక్షాక్
ఈ వార్తాకథనం ఏంటి
భారత నౌకాదళానికి సముద్రంలో కొత్త దిక్సూచి చేరింది. సర్వే వెసెల్(SVL)తరగతికి చెందిన మూడో నౌక INSఇక్షాక్ ను గురువారం కొచ్చిలోని సదర్న్ నేవల్ కమాండ్‌లో అధికారికంగా సేవలోకి తీసుకోనున్నారు. ఇది నావికాదళం చేపట్టిన సముద్ర సర్వేవ్యవస్థ ఆధునికీకరణలో కీలక అడుగుగా భావిస్తున్నారు. దేశానికి ఉన్న విస్తారమైన సముద్ర సరిహద్దులను మరింత భద్రంగా పర్యవేక్షించడానికి ఈ నౌక కీలక పాత్ర పోషించనుంది. ఇక్షాక్ నౌకను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ సంస్థ నిర్మించింది. మొత్తం నిర్మాణంలో సుమారు 80% స్వదేశీ భాగస్వామ్యం ఉండటం 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. 'ఇక్షాక్' అంటే సంస్కృతంలో 'మార్గదర్శి' అని అర్థం.పేరు తగ్గటే.. ఇది సముద్ర మార్గాలను ఖచ్చితంగా గుర్తించి చూపించడానికి సిద్ధంగా ఉన్న నౌక.
వివరాలు
సముద్ర మార్గాల మ్యాప్‌లు మరింత స్పష్టంగా రూపొందించేందుకు అవకాశం
ఈ నౌక తీర ప్రాంతాలు, లోతైన సముద్ర ప్రాంతాలు, పోర్టులు, హార్బర్లు, నావిగేషన్ మార్గాలపై వివరమైన హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహిస్తుంది. సేకరించే డాటా సముద్ర ప్రయాణ భద్రతకు చాలా ఉపయోగపడుతుంది. దీనితో సముద్ర మార్గాల మ్యాప్‌లు మరింత స్పష్టంగా రూపొందించేందుకు అవకాశం ఉంటుంది. ఇక్షాక్‌లో ఆధునిక పరికరాల వ్యవస్థ ఉంది. వీటిలో హై-రెజల్యూషన్ మల్టీ-బీమ్ ఎకో సౌండర్, ఆటోనమస్ అండర్‌వాటర్ వెహికల్ (AUV), రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్ (ROV), అలాగే నాలుగు చిన్న సర్వే మోటార్ బోట్స్ ఉన్నాయి.
వివరాలు
నౌకాదళం హైడ్రోగ్రాఫిక్ సర్వే సామర్థ్యం మరింత మెరుగవుతుంది
దీని వలన నౌకాదళం హైడ్రోగ్రాఫిక్ సర్వే సామర్థ్యం మరింత మెరుగవుతుంది. INS ఇక్షాక్ ప్రవేశంతో భారత నౌకాదళం సముద్ర సర్వే, భూపటాల తయారీ రంగాల్లో మరో బలమైన ముందడుగు వేసింది. స్వదేశీ శక్తి, సాంకేతిక నైపుణ్యం, సముద్ర రక్షణలో అప్రమత్తతకు ఇది ప్రతీకగా నిలవనుంది. భారత సముద్ర సరిహద్దులను కాపాడుతూ, తెలియని సముద్ర మార్గాలను దేశ హితం కోసం ఈ నౌక ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.