
INS Nistar: భారత నేవీకి కొత్త అస్త్రం.. స్వదేశీ డైవింగ్ సపోర్ట్‌తో రూపొందిన నిస్తార్ ప్రారంభం..
ఈ వార్తాకథనం ఏంటి
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ రక్షణ రంగంలో మరో కీలక అడుగు పడింది. భారత నౌకాదళం జూలై 18న విశాఖపట్టణంలో స్వదేశీ రూపకల్పనతో నిర్మించిన మొట్టమొదటి డైవింగ్ సపోర్ట్ వెసెల్ (DSV),ఐఎన్‌ఎస్ నిస్తార్‌ను ప్రారంభించనుంది. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్,నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి,ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో ఈ నౌకను అధికారికంగా నౌకాదళంలోకి చేర్చనున్నారు. హిందుస్తాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL) తయారు చేసిన INS నిస్తార్.. ప్రపంచ ప్రమాణాలకు తగ్గట్టుగా అధునాతన నౌకలను తయారు చేయగల భారత్ సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ నౌకలో 80 శాతం కంటే ఎక్కువ భాగం స్వదేశీ కంటెంట్‌తో తయారైంది.
వివరాలు
నౌకలో అత్యాధునిక రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్
దాదాపు 120 వరకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు)దీనికి తమ భాగస్వామ్యాన్ని అందించాయి. సుమారు 10,500 టన్నుల గ్రాస్ రెజిస్టర్ టన్నేజీ (GRT)బరువు ఉన్న INS నిస్తార్.. సుమారు 120 మీటర్ల పొడవు, 20 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో నిర్మించారు. లోతైన సముద్రాల్లో డైవింగ్ కార్యకలాపాలు నిర్వహించడమే కాకుండా, ప్రమాదంలో ఉన్న జలాంతర్గాముల నుంచి సిబ్బందిని రక్షించే క్లిష్టమైన పనులను ఈ నౌక చేపట్టగలదు. ఈ నౌకలో అత్యాధునిక రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్(ROVs) అమర్చబడ్డాయి. వీటి సహాయంతో సముద్ర గర్భంలో కచ్చితమైన కార్యకలాపాలను నిర్వహించగలుగుతాయి. డీప్ సబ్‌మెర్జెన్స్ రెస్క్యూ వెహికల్(DSRV)కోసం మదర్‌షిప్‌గాను ఈ నౌక ఉపయోగపడుతుంది. ఈ నౌక ద్వారా భారతదేశ జలాంతర్గాముల రెస్క్యూ సామర్థ్యాలు గణనీయంగా పెరగనున్నాయి.
వివరాలు
"కచ్చితత్వంతో, ధైర్యంతో విముక్తి"
నౌక పైభాగంలో సముద్ర స్థిరత్వాన్ని సూచించే లంగరు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. లంగరుకు చుట్టూ డాల్ఫిన్ ఆకారాన్ని అందించారు. ఇది సంప్రదాయంగా నావికుల మిత్రంగా, మానసిక ఉల్లాసాన్ని చిహ్నంగా సూచిస్తుందని నమ్ముతారు. "కచ్చితత్వంతో, ధైర్యంతో విముక్తి" అనే నినాదం ఈ నౌక కట్టుబాట్లను, దాని బాధ్యతలను ప్రతిబింబిస్తుంది. తూర్పు నౌకాదళంలో త్వరలో సేవలు ప్రారంభించనున్న INS నిస్తార్.. భారతదేశ సముద్ర భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయనున్న కీలక ఆస్తిగా భావించవచ్చు.