Nara Lokesh: స్పష్టమైన లక్ష్యమే విజయానికి దారి: నారా లోకేశ్
ఈ వార్తాకథనం ఏంటి
విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రవచనకర్త, ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సిద్ధం చేసిన పుస్తకాలను అందిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ నిర్వహించిన 'విలువల విద్య' సదస్సులో ఆయన చాగంటితో కలిసి పాల్గొన్నారు. పిల్లలను సరైన దారిలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులపై ఎంతో ఉందని లోకేశ్ స్పష్టం చేశారు.
వివరాలు
ఉపాధ్యాయుల సమస్యల్లో చాలావరకు పరిష్కారం చూపాం: లోకేశ్
"పిల్లల్లో మార్పు ముందుగా ఇంటి పరిసరాల నుంచే రావాలి. మహిళలకు గౌరవం ఉన్నప్పుడే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. సినిమాల్లోనే కాదు, వెబ్ సిరీస్‌లలో కూడా మహిళలను అవమానించేలా చూపడం తప్పు. మార్కులు తగ్గాయి అని ప్రాణాలు తీసుకోవడం అసలు సరైంది కాదు. జీవితంలో అవమానాలు, ఇబ్బందులు సహజం. లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగితే విజయాన్ని అందుకోగలం. ఉపాధ్యాయుల సమస్యల్లో చాలావరకు పరిష్కారం చూపాం. విద్యా విధానంలో మార్పులు తీసుకువస్తున్నాం" అని లోకేశ్ అన్నారు.