Student suicide: ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య.. కుటుంబ సభ్యుల ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
నూతన సంవత్సరం వేళ.. మహబూబ్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గల మైనార్టీ గురుకులంలో సోమవారం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే బాలుడి మృతిపై అతని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై విచారణ జరిపించాలని విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
నారాయణ పేట జిల్లా మద్దూర్ మండలం, భూనీడ్‌కు చెందిన లక్ష్మి, హనుమంతురెడ్డి కుమారుడు రాంరెడ్డి (17) మహబూబ్‌నగర్ మైనార్టీ గురుకులంలో ఇంటర్ సీఈసీ చదువుతున్నాడు.
ఆత్మహత్య
న్యూ ఇయర్ వేడుకల తర్వాత తరగతి గదిలో ఉరి
డిసెంబర్ 31 రాత్రి న్యూ ఇయర్ వేడుకలను స్నేహితులతో కలిసి చేసుకున్న రాంరెడ్డి.. ఆ తర్వాత హాస్టల్ పై ఫ్లోర్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు.
జనవరి 1వ తేదీన ఉదయం 9:30కు తరగతి గదిలో రాంరెడ్డి ఉరేసుకున్నట్లు కాలేజీ నిర్వహకులు గుర్తించారు. వెంటనే జిల్లా దవాఖానకు తరలించారు.
అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం కాలేజీ యాజమాన్యం.. తల్లిదండ్రులకు సమాచారం అందించింది.
దీంతో భూనీడ్ గ్రామస్తులు పెద్ద ఎత్తున గురుకులం కాలేజీకి తరలివచ్చారు. రాంరెడ్డి మృతిపై అనుమానాలు ఉన్నాయని, విచారణ జరిపించాలని తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు.