Interim Budget: పర్యాటక రంగానికి ప్రోత్సాహం.. లక్షద్వీప్‌పై స్పెషల్ ఫోకస్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్‌లో పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. లక్షద్వీప్‌తో సహా దేశంలోని దీవుల్లో పోర్టు కనెక్టివిటీ, టూరిజం మౌలిక సదుపాయాలు, ఇతర సౌకర్యాల కోసం ప్రాజెక్టులను ప్రకటించారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యాటక ప్రదేశాల్లో ఉపాధిని పెంచడానికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. దేశీయంగా పర్యాటక ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ఓడరేవు కనెక్టివిటీకి సంబంధించిన ప్రాజెక్టులు, పర్యాటక మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి లోక్‌సభలో తెలిపారు.
మాల్దీవులకు ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా లక్షద్వీప్
కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌లో పర్యాటక మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు. మాల్దీవులతో దౌత్యపరమైన వివాదం తర్వాత, చాలా మంది భారతీయులు లక్షద్వీప్‌ను ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు దేశీయంగా పర్యాటకులను ఆకర్షించేలా, మాల్దీవులకు ప్రత్యామ్నాయ గమ్యస్థానం లక్ష్యదీప్‌ను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది.
మాల్దీవులు-భారత్ మధ్య దౌత్య వివాదం
జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో పర్యటించారు. ఆయన పర్యటనను హేళన చేస్తూ.. కొందరు మాల్దీవుల రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పెద్ద దుమారం చెలరేగింది. ఇరు దేశాల మధ్య దౌత్య పరమైన వివాదం నెలకొన్న నేపథ్యంలో అనేక మంది భారతీయ పర్యాటకులు మాల్దీవులకు తమ పర్యటనలను రద్దు చేసుకుని, బదులుగా లక్షద్వీప్ వెళ్లేందుకు విమానాలను బుక్ చేసుకున్నారు. భారతదేశం అంతటా పర్యాటకాన్ని పెంపొందించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధిచిన ప్రకటనను నిర్మలా సీతారామన్ చేసారు. గత నవంబర్‌లో 'వెడ్ ఇన్ ఇండియా' కాన్సెప్ట్‌ను ప్రధాని మోదీ ప్రకటించారు. డెస్టినేషన్ వెడ్డింగులను ఇండియాలోనే జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.