Intermediate Education: పాఠశాల విద్యలో ఇంటర్ విలీనం.. ఇక ఒకే పరీక్షల బోర్డు
ఈ వార్తాకథనం ఏంటి
పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేసే ప్రక్రియకు ప్రభుత్వం వేగం పెంచింది. పాఠశాల, ఇంటర్ విద్యకు ఇకపై ఒకటే పరీక్షల బోర్డు ఉండేలా చర్యలు చేపడుతోంది. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభానికి మరో 25 రోజులు మాత్రమే ఉండటంతో ఈ మార్పులపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం రెండు శాఖలకు వేర్వేరు చట్టాలు అమల్లో ఉండటంతో వాటిని సవరించేందుకు ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఇంటర్ ప్రవేశాల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో త్వరలోనే ఆర్డినెన్స్ వెలువడే అవకాశం ఉంది.
వివరాలు
తెలంగాణ విద్యా చట్టం (1982)లో మార్పులు
ఈ అంశంపై విద్యాశాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి శ్రీదేవసేన సమక్షంలో పాఠశాల, ఇంటర్ విద్యాశాఖ అధికారులు గురువారం సమావేశమై విస్తృతంగా చర్చించారు. డిసెంబరులో విడుదల చేసిన దార్శనిక పత్రంలో ఉమ్మడి బోర్డుకు తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు (టీజీఎస్‌ఈబీ)గా పేరు పెట్టనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో కలపాలంటే ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు చట్టాలను ఒకటిగా మార్చాల్సి ఉంటుంది. అందుకోసం తెలంగాణ విద్యా చట్టం (1982)లో మార్పులు చేసి, తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా చట్టం (1971)ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పరీక్షల విభాగం, ఇంటర్మీడియట్ విద్యామండలిని కలిపి ఒకే ఉమ్మడి బోర్డు ఏర్పాటు చేయనున్నారు.
వివరాలు
ఈ మార్పులు అమల్లోకి వస్తే..
ప్రతి రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్‌కు ఒకే బోర్డు ఉండాలని కేంద్ర ప్రభుత్వం గతంలో సూచించిన విషయం తెలిసిందే. ఈ మార్పులు అమల్లోకి వస్తే జూనియర్ కళాశాలలు కూడా పాఠశాల విద్య పరిధిలోకి చేరతాయి. ఈ విలీనంతో పలు ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి సంవత్సరం పదో తరగతి పూర్తిచేసే లక్షలాది విద్యార్థుల్లో చాలామంది ఇంటర్ లేదా సమాన విద్యలో చేరడం లేదు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు చదువు మధ్యలోనే మానేస్తున్నారు. ఇంటర్‌ను పాఠశాల విద్యలో కలపడం వల్ల ఈ పరిస్థితి మారి చదువు మానేసే వారి సంఖ్య తగ్గే అవకాశముందని అంచనా వేస్తోంది.
వివరాలు
కేంద్ర పథకాల కింద మరిన్ని నిధులు పొందే అవకాశం
అలాగే పాఠశాల విద్యలో ఇంటర్‌ను చేర్చడం ద్వారా కేంద్ర పథకాల కింద మరిన్ని నిధులు పొందే అవకాశం ఉంటుంది. దీంతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి. పాఠశాలలు, జూనియర్ కళాశాలలు వేర్వేరుగా ఉండటం వల్ల ల్యాబ్‌లు, గ్రంథాలయాలు వేర్వేరుగా నిర్వహించాల్సిన అవసరం లేకుండా, అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవచ్చు. ఇంకా పాఠశాల నుంచి ఇంటర్ వరకు ఒకే ఉపాధ్యాయులు బోధించే అవకాశం ఉండటం వల్ల విద్యార్థులకు సులభంగా అలవాటు ఏర్పడుతుంది. విద్యార్థుల సామర్థ్యాన్ని ఉపాధ్యాయులు స్పష్టంగా అర్థం చేసుకుని వారికి సరైన మార్గదర్శనం ఇవ్వగలుగుతారు. ప్రస్తుతం ఉన్న విభజన కారణంగా ఈ సమన్వయం కొరవడుతోంది.