Kite Festival: పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్.. మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
2026 జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న 'ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్' సందర్భంగా మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీని విడుదల చేశారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం నేపథ్యంలో ట్రాఫిక్ సజావుగా సాగేందుకు పరేడ్ గ్రౌండ్స్ పరిసర రహదారులను సాధ్యమైనంత వరకు ఉపయోగించకుండా ఉండాలని ప్రయాణికులకు సూచించారు. మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ మంగళవారం జారీ చేసిన ఈ అడ్వైజరీ ప్రకారం, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అవసరాన్ని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయి.
Details
మరికొన్ని రూట్లు మూసివేత
పరేడ్ గ్రౌండ్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పలు మార్గాల్లో వాహనాలను మళ్లించనుండగా, మరికొన్ని రూట్లను పూర్తిగా మూసివేయనున్నారు. ట్రాఫిక్ రద్దీ తీవ్రతను బట్టి సీటీఓ ఎక్స్ రోడ్, ప్లాజా ఎక్స్ రోడ్లు, టివోలి ఎక్స్ రోడ్ల మధ్యనున్న ప్రాంతాన్ని అవసరాన్ని అనుసరించి తాత్కాలికంగా క్లోజ్ చేసే అవకాశం ఉందని తెలిపారు. బాలమ్రాయ్, బ్రూక్‌బాండ్, టాడ్‌బండ్ ఎక్స్ రోడ్లు, మస్తాన్ కేఫ్ ప్రాంతాలు, అలాగే సీటీఓ, ప్లాజా జంక్షన్లు, టివోలి, పికెట్ జంక్షన్లు, సికింద్రాబాద్ క్లబ్ (ఇన్ గేట్), ఎన్‌సీసీ, స్వీకార్ ఉపకార్, YMCA, ఎస్బీఐ జంక్షన్లు వంటి కీలక ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేశారు.
Details
ప్రయాణికులకు ముందుగానే బయలుదేరాలి
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)కు వెళ్లే ప్రయాణికులు ముందుగానే బయలుదేరాలని సూచించారు. ఈ నేపథ్యంలో మెట్రో రైలు సేవలను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సిఫార్సు చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌లోపల పార్కింగ్ అనుమతి కేవలం అనుమతిపత్రాలు ఉన్న వాహనాలకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. జింఖానా ఎగ్జిబిషన్ గ్రౌండ్, జింఖానా క్రికెట్ గ్రౌండ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ప్రాంగణం, ధోబీఘాట్ తదితర ప్రాంతాల్లో ఈవెంట్ నిర్వాహకులు, సాధారణ ప్రజలు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధోబీఘాట్‌లో వాహనాలు పార్క్ చేసే ప్రయాణికుల కోసం పరేడ్ గ్రౌండ్స్ ఈస్ట్ గేట్ నంబర్ 11 వరకు షటిల్ బస్సు సర్వీస్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
Details
ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి
సాధారణ ప్రజలకు వెస్ట్ గేట్-1, ఈస్ట్ గేట్ నంబర్ 11 ద్వారా ప్రవేశానికి అనుమతి ఉంటుందని తెలిపారు. ఓలా, ఉబర్, రాపిడో వంటి క్యాబ్ సేవలు వినియోగించే వారు ప్యారడైజ్ మెట్రో స్టేషన్, టివోలి జంక్షన్, ఎస్బీఐ జంక్షన్, స్వీకార్ ఉపకర్ జంక్షన్‌ల వద్ద ఏర్పాటు చేసిన పికప్, డ్రాప్-ఆఫ్ పాయింట్లను ఉపయోగించాలని పోలీసులు కోరారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి సహకరించాలని, ట్రాఫిక్ మళ్లింపులను తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. పండుగ రోజుల నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు. ట్రాఫిక్‌కు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 8712662999ను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.