Page Loader
Arnold Dix : సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులను రక్షించిన ఆర్నాల్డ్ ఎవరో తెలుసా?
Uttarakhand: సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులను రక్షించిన ఆర్నాల్డ్ ఎవరో తెలుసా?

Arnold Dix : సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులను రక్షించిన ఆర్నాల్డ్ ఎవరో తెలుసా?

వ్రాసిన వారు Stalin
Nov 29, 2023
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌(Uttarakhand) ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కూలీలను విజయవంతంగా రక్షించారు. రెస్క్యూ ఆపరేషన్(rescue operation) విజయవంతంగా పూర్తికావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంత క్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతం చేసిన అంతర్జాతీయ టన్నెల్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్(Arnold Dix) గురించే అంతా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆయన నేపథ్యం ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు ఆర్నాల్డ్ డిక్స్‌ను కేంద్రం ప్రత్యేకంగా ఆహ్వానించింది. సొరంగం(tunnel) నుంచి కార్మికులను బయటకు తీసుకువచ్చిన నిపుణుల్లో ఆర్నాల్డ్‌ది చాలా పెద్ద పాత్ర అని చెప్పాలి. ఆర్నాల్డ్ భూగర్భ, రవాణా మౌలిక సదుపాయాల్లో నిపుణుడు. భూగర్భ నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లపై ఆయన చాలా విలువైన సలహా ఇస్తుంటారు.

ఉత్తరాఖండ్

మూడు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో భూగర్భ ఆపరేషన్స్‌

ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ ఆఫ్ జెనీవా అనే సంస్థకు ఆర్నాల్డ్ ప్రస్తుతం చీఫ్‌గా ఉన్నారు. ఈ సంస్థ భూగర్భ నిర్మాణానికి సంబంధించిన చట్టపరమైన, పర్యావరణ, రాజకీయ, ఇతర సవాళ్లను విశ్లేషించడమే కాకుండా పరిష్కార మార్గాలను కూడా చూపిస్తుంది. డిగ్స్ టన్నెలింగ్ నిపుణుడు మాత్రమే కాకుండా అతను ఇంజనీర్, లాయర్, జియాలజిస్ట్ కూడా కావడం గమనార్హం. అతను మెల్‌బోర్న్‌లోని మోనాష్ యూనివర్శిటీ నుంచి సైన్స్, లాలో పట్టా తీసుకున్నారు. ఆర్నాల్డ్ తన మూడు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో భూగర్భ ఆపరేషన్స్‌లో పాల్గొన్నారు. 2016- 2019 మధ్య ఖతార్ రెడ్ క్రెసెంట్ సొసైటీకి వాలంటీర్‌గా పనిచేశారు. అక్కడ భూగర్భ సమస్యలపై అవగాహన కల్పించారు.

రెస్క్యూ

ఆర్నాల్డ్ డిక్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు

నవంబర్ 12న కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారు. క్లిష్టమైన ఆపరేషన్ కావడంతో ఆర్నాల్డ్‌ను కేంద్రం పిలిచింది. ఈ క్రమంలో నవంబర్ 20న టన్నెల్ సైట్ వద్దకు ఆర్నాల్డ్ వచ్చారు. సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్న ఏజెన్సీలతో ఆయన మాట్లాడారు. రాజకీయ నాయకులు, స్థానిక అధికారుల మాదిరిగా ఆయన కార్మికులు నేడు బయటకు వస్తారు, రేపు వస్తారు అని మభ్యపెట్టలేదు. క్రిస్మస్ నాటికి మాత్రం అందరు కార్మికులు సురక్షితంగా వారి ఇళ్లలో ఉంటారని మాత్రం హామీ ఇచ్చారు. ఆయన హామీ ఇచ్చినట్లుగా అనుకున్న సమయానికి కంటే ముందుగా కార్మికులు సురక్షితంగా టన్నెల్ నుంచి బయటకు రావడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులను రక్షించడంతో కీలక పాత్ర పోషించిన ఆర్నాల్డ్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.