Telangana Rising Global Summit: తొలి రోజు రూ.3,97,500 కోట్లు పెట్టుబడులు.. ప్రభుత్వంతో పలు కంపెనీల ఎంఓయూలు
ఈ వార్తాకథనం ఏంటి
'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్' తొలి రోజే పెట్టుబడుల వెల్లువెత్తింది. సదస్సు ప్రారంభమైన సోమవారం ఒక్కరోజులోనే రాష్ట్రంలో రూ.3,97,500కోట్ల మేర పెట్టుబడులకు వివిధ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. సమిట్ వేదికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో ఈఎంఓయూలపై కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 2047 విజన్ సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం సాంకేతికత,సుస్థిర అభివృద్ధిని ప్రధాన లక్ష్యాలుగా చేసుకుని ముందుకెళ్తోందన్నారు. ఈదిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చిన ఈభారీ పెట్టుబడులు...ఉద్యోగాల సృష్టికి,అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతుల నిర్మాణానికి దోహదపడతాయని,దేశ ఆర్థిక పురోగతిలో తెలంగాణను అగ్రనాయకత్వ స్థానంలో నిలిపేలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
వివరాలు
ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలతో పాటు నైట్ సఫారీ
రిలయన్స్ గ్రూప్‌కు చెందిన 'వంతార' సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యంగా ప్రపంచ స్థాయి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, నైట్ సఫారీ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దేశంలో వన్యప్రాణుల పునరావాస పనులను మరింత మెరుగుపరిచేలా శాస్త్రీయ సంరక్షణ, పరిశోధన కార్యక్రమాలు చేపట్టనుంది. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలతో పాటు నైట్ సఫారీ అనుభవాలను కూడా అందించనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను వంతార ప్రతినిధులు వివరించగా, అవసరమైన అన్ని సహాయాలను అందించేందుకు పర్యాటక, అటవీ, పర్యావరణ శాఖలు అంగీకరించాయి. వన్యప్రాణి సంరక్షణ రంగంలో ముందడుగు వేసినందుకు వంతార సంస్థను సీఎం అభినందించారు. ఈ ప్రాజెక్టుతో పర్యాటకం పెరగడమే కాకుండా స్థానికంగా ఉపాధి అవకాశాలు కూడా విస్తరిస్తాయని తెలిపారు.
వివరాలు
మోటార్ స్పోర్ట్స్ హబ్‌గా హైదరాబాద్
భారత్ ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రేసింగ్, మోటోక్రాస్ కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు 'సూపర్‌క్రాస్ ఇండియా' సంస్థ ప్రతిపాదనలు సమర్పించింది. ప్రపంచ స్థాయి రేసింగ్ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఆధునిక ట్రాక్‌లు, రైడర్ శిక్షణ కేంద్రాలు, ప్రేక్షకులకు అనువైన మౌలిక సదుపాయాలు, అతిథ్య ఏర్పాట్లను కల్పించనుంది. సంస్థ ప్రతిపాదిత లేఅవుట్‌ను ప్రభుత్వం ముందు ప్రదర్శించింది. హైదరాబాద్‌ను మోటార్ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్ది, స్పోర్ట్స్ - ఎంటర్‌టైన్‌మెంట్ కారిడార్‌గా మార్చడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లకు ఈ కేంద్రం ఆతిథ్యం ఇవ్వనుంది. మోటార్ స్పోర్ట్ పర్యాటకంతో పాటు కోచింగ్, ఈవెంట్ల నిర్వహణ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మరింత పెరగనున్నాయి.
వివరాలు
టౌన్‌షిప్‌లో గోల్ఫ్ కోర్సు, రేస్ కోర్సు, ప్రీమియం నివాస ప్రాంగణాలు
రాష్ట్రంలో రూ.10 వేల కోట్ల పెట్టుబడితో సమీకృత టౌన్‌షిప్‌తో పాటు ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియోను ఏర్పాటు చేసేందుకు సల్మాన్ ఖాన్ వెంచర్స్ సంస్థ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో లగ్జరీ హోటళ్లు, రిసార్టులు, క్రీడా మౌలిక సదుపాయాలు, పూర్తిస్థాయి సినిమా నిర్మాణ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఈ టౌన్‌షిప్‌లో గోల్ఫ్ కోర్సు, రేస్ కోర్సు, ప్రీమియం నివాస ప్రాంగణాలు కూడా ఉంటాయి. ఫిల్మ్ స్టూడియో సముదాయంలో సినిమా నిర్మాణం, ఓటీటీ కంటెంట్ తయారీ, పోస్ట్ ప్రొడక్షన్ వంటి అన్ని విభాగాలకు అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండనున్నాయి. క్రియేటివ్ రంగంలో ఇది భారీ పెట్టుబడిగా సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
వివరాలు
రూ.800 కోట్లతో డీమ్డ్ టు బీ యూనివర్సిటీ
తెలంగాణలో హెల్త్‌కేర్ రంగాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా అపోలో హాస్పిటల్స్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వైద్య విద్య విస్తరణ,డిజిటల్ హెల్త్ అభివృద్ధి,కమ్యూనిటీ హెల్త్ సేవలను బలోపేతం చేయడం ఈ భాగస్వామ్య ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రపంచ స్థాయి వైద్య సేవలను విస్తరించడం,క్లినికల్ రీసెర్చ్,జీనోమిక్స్,టెలీహెల్త్, ఫార్మసీ,లాజిస్టిక్ వ్యవస్థల పరిపుష్టికి కృషి చేయనుంది. అంతర్జాతీయ స్థాయి వైద్య ప్రతిభను తయారు చేయడమూ లక్ష్యంగా పెట్టుకుంది. రూ.800 కోట్లతో డీమ్డ్ టు బీ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ విశ్వవిద్యాలయం ద్వారా వచ్చే పదేళ్లలో జీనోమిక్స్, రోబోటిక్స్, ఏఐ, డిజిటల్ హెల్త్, ఎలైడ్ సైన్సెస్, గ్లోబల్ హెల్త్ విభాగాల్లో సుమారు 17 వేల మంది నిపుణులను సిద్ధం చేయనున్నారు.
వివరాలు
తెలంగాణలో రూ.41 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్
అదనంగా రాష్ట్రవ్యాప్తంగా 200 ఫార్మసీ స్టోర్లు ప్రారంభించి మరో వెయ్యి మందికి ఉపాధి కల్పించనున్నారు. తెలంగాణను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. విద్య, పరిశోధనల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ఉన్నత విద్యాభివృద్ధి, అధ్యాపకుల శిక్షణ, ఆవిష్కరణ ఆధారిత పరిశోధనలకు ప్రోత్సాహం, డిజిటల్ లెర్నింగ్‌ను విస్తరించడం ఈ ఒప్పంద ప్రధాన లక్ష్యాలు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (టీఎంటీజీ) సంస్థ తెలంగాణలో రూ.41 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఏఐ ఆధారిత గవర్నెన్స్ వ్యవస్థలు, మీడియా టెక్నాలజీలతో కూడిన ఫ్యూచర్ స్మార్ట్ సిటీల అభివృద్ధి చేపట్టనుంది.
వివరాలు
ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థలు - పెట్టుబడులు
డీప్ టెక్, ఫ్యూచర్ సిటీ అండ్ కోర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగంలో రూ.1,04,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. బ్రూక్‌ఫీల్డ్ - యాక్సిస్ వెంచర్స్ కన్సార్షియం రూ.75,000 కోట్లు, విన్ గ్రూప్ రూ.27,000 కోట్లు, సిడ్బీ స్టార్టప్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ వెంచర్ రూ.1,000 కోట్లు, వాక్ టు వర్క్ ఇన్నోవేషన్ హబ్ రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాయి. పునరుత్పాదక శక్తి మార్పిడి - పవర్ సెక్యూరిటీ రంగంలో మొత్తం రూ.39,500 కోట్లు రానున్నాయి. ఇందులో ఈవ్రెన్ యాక్సిస్ ఎనర్జీ రూ.31,500 కోట్లు, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ.8,000 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.
వివరాలు
రూ.19,350 కోట్లు ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్ గేట్వే విభాగం
ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్ గేట్వే విభాగంలో రూ.19,350 కోట్లు రాబోతున్నాయి. జీఎంఆర్ గ్రూప్ ఏరోస్పేస్ రూ.15,000 కోట్లు, అపోలో మైక్రోసిస్టమ్స్ రూ.1,500 కోట్లు, సోలార్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రూ.1,500 కోట్లు, ఎంపీఎల్ లాజిస్టిక్స్ రూ.700 కోట్లు, టీవీఎస్ ఐఎల్పీ రూ.200 కోట్లు, ఇతర సంస్థలు కలిపి మరో రూ.450 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నాయి.
వివరాలు
రూ.7,000 కోట్ల పెట్టుబడి
అధునాతన తయారీ - కోర్ ఇండస్ట్రీల రంగంలో రూ.11,960 కోట్లు వస్తున్నాయి. సాహీటెక్ ఇండియా (హైడ్రోజన్ టెక్నాలజీ డిస్ట్రిబ్యూషన్) రూ.1,000 కోట్లు, కృష్ణా పవర్ యుటిలిటీస్ రూ.5,000 కోట్లు, అల్ట్రా బ్రైట్ సిమెంట్స్ - రైన్ సిమెంట్స్ రూ.2,000 కోట్లు, సీతారాం స్పిన్నర్స్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రూ.3,000 కోట్లు, సోలాపూర్ తెలంగాణ టెక్స్టైల్ అసోసియేషన్ అండ్ జీనియస్ ఫిల్టర్స్ పవర్‌లూం రంగంలో రూ.960 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. హైడ్రోజన్ టెక్నాలజీ విస్తరణలో రెన్యూసిస్, మిడ్ వెస్ట్, అక్షత్ గ్రీన్‌టెక్ ఎలక్ట్రానిక్స్ సంస్థల ద్వారా రూ.7,000 కోట్ల పెట్టుబడి రానుంది.