Loading...
Trainee IPS: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. కేసులో కీలక మలుపు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. కేసులో కీలక మలుపు

Trainee IPS: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం.. కేసులో కీలక మలుపు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA)లో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదుతో కేసు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మోతీనగర్‌లోని తన బంధువుల నివాసంలో శానిటైజర్ తాగిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఎస్‌ఆర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని, ఆత్మహత్యాయత్నానికి ముందు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్టు చేసినట్లు తెలిసింది.

వివరాలు 

కర్ణాటక మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై లైంగిక వేధింపులు 

కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి, ఉదయ్ కృష్ణారెడ్డి తనను శారీరకంగా, లైంగికంగా వేధిస్తున్నారని అకాడమీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

జూన్ 23 నుంచి అసభ్యకర సందేశాలు పంపుతున్నారని, జూలై 8న తన గదిలోకి లాక్కెళ్లి ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాలని బెదిరించాడని ఆరోపించారు.

మరుసటి రోజు గదిలో బంధించి జుట్టు పట్టుకుని దాడి చేయడంతో పాటు మెడపై కత్తి పెట్టి బెదిరించాడని పేర్కొన్నారు.

జూలై 10న తన వ్యక్తిగత వీడియోలు రికార్డు చేసి, వాటిని భర్తకు పంపిస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడని కూడా ఫిర్యాదులో వివరించారు.

వివరాలు 

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 74, 75, 77, 315(2)తో పాటు ఐటీ చట్టంలోని సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రాథమిక విచారణలో ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో కూడా సహచర ట్రైనీ ఐపీఎస్ అధికారులతో అమర్యాదగా ప్రవర్తించినట్లు, వాట్సాప్ గ్రూపుల ద్వారా కొందరిని వేధించినట్లు పోలీసులకు సమాచారం లభించినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన నేషనల్ పోలీస్ అకాడమీ ప్రివిలేజ్ కమిటీ సీసీటీవీ దృశ్యాలు,ఇతర ఆధారాలను పరిశీలించింది.

ప్రాథమిక విచారణలో ఆరోపణలకు బలం ఉన్నట్లు గుర్తించిన కమిటీ, ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేసి అకాడమీ నుంచి పంపించింది.

ADVERTISEMENT

వివరాలు 

2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధులు

అయితే, భవిష్యత్తులో ఆయన ఐపీఎస్ సర్వీసులో కొనసాగాలా లేదా అన్న తుది నిర్ణయం కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ (DoPT) తీసుకుంటుందని అకాడమీ అధికారులు స్పష్టం చేశారు.

ప్రకాశం జిల్లా ఊళ్లపాలెంకు చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి జీవితం ఒకప్పుడు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది.

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయన నానమ్మ వద్ద పెరిగారు.

ఆమె కూరగాయలు అమ్మే పనిలో సహాయం చేస్తూనే ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేశారు.

2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైన చివరి కానిస్టేబుల్ నియామకాలలో ఎంపికై కొన్నేళ్లు పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించారు.

ADVERTISEMENT

వివరాలు 

కానిస్టేబుల్‌గా రాజీనామా చేసి సివిల్స్‌పై పూర్తిస్థాయిలో దృష్టి

ఉద్యోగంలో ఎదురైన అవమానకర ఘటన అనంతరం రాజీనామా చేసి సివిల్స్‌పై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.

వరుసగా నాలుగు ప్రయత్నాల్లో విఫలమైనప్పటికీ వెనుకడుగు వేయకుండా కృషి కొనసాగించారు.

ఐదో ప్రయత్నంలో అఖిల భారత స్థాయిలో 360వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు.

కానిస్టేబుల్ స్థాయి నుంచి ఐపీఎస్ అధికారిగా ఎదిగిన ఆయన ప్రయాణం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక మంది యువతకు ఆదర్శంగా నిలిచింది.

ప్రస్తుతం శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలోనే తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి చేసిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదై, దర్యాప్తు కొనసాగుతోంది.

ADVERTISEMENT