Page Loader
Election Commission: దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణకు ఈసీ సన్నద్ధం?
దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణకు ఈసీ సన్నద్ధం?

Election Commission: దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణకు ఈసీ సన్నద్ధం?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 13, 2025
04:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌లో ఓటర్ల జాబితాలపై చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు సమర్థించిన నేపథ్యంలో, ఇప్పుడు అదే తరహాలో దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల పరిశుద్ధీకరణకు ఎన్నికల సంఘం రంగంలోకి దిగనుంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల స్థానిక ఎన్నికల యంత్రాంగాలను ఈసీ ఇప్పటికే అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా వచ్చే నెల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించే అవకాశముందని సమాచారం. ప్రస్తుతం ఓటరు జాబితాల్లో నకిలీ, అనర్హ వ్యక్తులు చొరబడి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కసరత్తు ప్రాధాన్యం సంతరించుకుంది.

Details

 2002-2004లో చివరిసారి సమగ్ర సవరణ

దేశంలోని చాలా రాష్ట్రాలు చివరిసారిగా 2002-2004 మధ్యకాలంలో ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ చేపట్టాయి. అందుకే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికరణలు (CEOs) గతంలో ప్రచురించిన జాబితాలను తమ అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులోకి తెస్తున్నారు. ఉదాహరణకు ఢిల్లీలో 2008లో, ఉత్తరాఖండ్‌లో 2006లో సమగ్ర సవరణ జరగగా.. వాటి జాబితాలను సంబంధిత రాష్ట్రాల CEO వెబ్‌సైట్లలో చూడొచ్చు.

Details

సుప్రీం ఆదేశాలు - రాజ్యాంగబద్ధ అధికారం

ఈ నెల 10న బిహార్‌ సవరణపై దాఖలైన పలు పిటిషన్లను విచారించిన సుప్రీం కోర్టు - ఓటరు జాబితాల సమగ్ర సవరణ చేపట్టే అధికారం ఎన్నికల సంఘానిదేనని తేల్చిచెప్పింది. అయితే బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ సమగ్ర సవరణ సమర్థతపై ప్రశ్నలు ఉన్నాయని అభిప్రాయపడింది. అయినప్పటికీ, ఈ ప్రక్రియపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అలాగే, ఓటర్ల గుర్తింపు కోసం పరిశీలించే పత్రాల జాబితాలో ఆధార్‌, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డుల వంటి ఆధారాలను ఉపయోగించవచ్చని సూచించింది.

Details

విదేశీ అక్రమ వలసదారులపై ప్రత్యేక దృష్టి 

ఈసీ ఇప్పటికే విదేశీ అక్రమ వలసదారుల గుర్తింపు, తొలగింపు కోసం ప్రత్యేక దృష్టి సారించింది. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ వంటి దేశాల నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన వారి వివరాలను పరిశీలిస్తూ చర్యలు తీసుకుంటోంది. బిహార్‌లో గుర్తించిన అనర్హులపై చర్యలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు అదే తరహాలో దేశవ్యాప్తంగా ఈ కసరత్తును విస్తరించేందుకు రంగం సిద్ధమవుతోంది. తదుపరి విచారణ - జూలై 28 బిహార్‌లో చేపడుతున్న సమగ్ర సవరణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు జూలై 28న మరోసారి విచారణ చేపట్టనుంది. ఆ విచారణ అనంతరం దేశవ్యాప్తంగా సమగ్ర సవరణపై ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుంది.