Maharashtra Next CM: మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ఖాయమా? నేడు అధికారిక ప్రకటన
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రభుత్వం ఏర్పాటుకు పనులు వేగంగా సాగుతున్నాయి. డిసెంబర్ 5న ప్రమాణ స్వీకారానికి తేదీని ప్రకటించినా, తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే ప్రశ్న రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది. బీజేపీ నేతలు, శివసేన (షిండే) మద్దతుదారులు ఈ అంశంపై ఓ నిర్ణయానికి వస్తున్నారు. అనారోగ్యం కారణంగా తన గ్రామానికి వెళ్లిన ఏక్‌నాథ్ షిండే కోలుకున్న అనంతరం ముంబైకి చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఏకాభిప్రాయంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని షిండే వెల్లడించారు. తదుపరి ముఖ్యమంత్రి ఎవరో మహారాష్ట్ర ప్రజలకే తెలిసిందని కేంద్ర మాజీ మంత్రి రావుసాహెబ్ దన్వే చెప్పారు.
మంత్రి వర్గాన్ని ముఖ్యమంత్రి ఎంపిక చేసే అవకాశం
కానీ ఆ పేరు పార్టీ హైకమాండ్ ఆమోదం పొందాలని, ముఖ్యమంత్రి మాత్రమే మంత్రివర్గం నియామకంపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారవుతుందని సమాచారం. సోమవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో ఫడ్నవీస్‌ను పక్షనేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. గతంలో 2014-2019 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, 2022లో డిప్యూటీ ముఖ్యమంత్రిగా సేవలందించిన ఫడ్నవీస్, మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.