Vijay: అవినీతిని ప్రశ్నించడమే నేరమా.. తనపై కుట్రలు జరుగుతున్నాయన్న విజయ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రభుత్వాల అవినీతి, అక్రమాలను నిరంతరం ప్రశ్నిస్తూ వాటిపై పోరాటం చేస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారని టీవీకే అధినేత విజయ్ (Vijay) ఆరోపించారు. తమ పార్టీ ఏర్పాటు చేయాలనుకుంటున్న బహిరంగ సభలకు కూడా డీఎంకే ప్రభుత్వం అనుమతులు నిరాకరిస్తోందని విమర్శించారు. ఈ కారణంగా రాష్ట్రంలోని ప్రతి ప్రాంత ప్రజలను నేరుగా కలిసే అవకాశం లేకుండా చేస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో టీవీకే విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గేది లేదని, అవినీతిపై తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వేలూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Details
స్టాలిన్ కుట్రలు పన్నుతున్నారు
రాష్ట్రంలో పెరుగుతున్న అవినీతి, నేరాలను అరికట్టడంలో సీఎం స్టాలిన్ (CM Stalin) నాయకత్వంలోని ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయ్ ఆరోపించారు. త్వరలో జరగబోయేవి సాధారణ ఎన్నికలు కాదని, తమిళనాడు ప్రజలు, అవినీతి ప్రభుత్వానికి మధ్య జరిగే యుద్ధమని అభివర్ణించారు. ఈ పోరాటంలో చివరికి ప్రజలే గెలుస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తనను ఎన్నికల్లో ఓడించాలనే లక్ష్యంతో స్టాలిన్ కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ఓటు వేయడం అంటే భాజపాకు మద్దతు ఇచ్చినట్లేనని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతోనే స్టాలిన్ ప్రభుత్వం భాజపాతో పొత్తు పెట్టుకునే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. పరిస్థితులకు అనుగుణంగా వైఖరి మార్చుకోవడం ఆ పార్టీ నాయకులకు అలవాటైందని తీవ్రంగా దుయ్యబట్టారు.