Loading...
Operation Safed Sagar: ఇజ్రాయెల్‌ సాయంతో లేజర్‌ బాంబులు.. కార్గిల్‌లో 'సఫేద్‌ సాగర్‌' అసలు కథ ఇదే..
ఇజ్రాయెల్‌ సాయంతో లేజర్‌ బాంబులు.. కార్గిల్‌లో 'సఫేద్‌ సాగర్‌' అసలు కథ ఇదే..

Operation Safed Sagar: ఇజ్రాయెల్‌ సాయంతో లేజర్‌ బాంబులు.. కార్గిల్‌లో 'సఫేద్‌ సాగర్‌' అసలు కథ ఇదే..

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2026
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

'ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వెబ్‌సిరీస్‌. 1999 కార్గిల్‌ యుద్ధంలో భారత వాయుసేనకు చెందిన 'ది గోల్డెన్‌ యారోస్‌' స్క్వాడ్రన్‌ ప్రదర్శించిన సాహసాలను ఇందులో చూపించారు. దీంతో అప్పట్లో వాయుసేన చేపట్టిన అత్యంత సవాల్‌తో కూడిన ఆపరేషన్‌ మరోసారి చర్చకు వచ్చింది. అసలు 'ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌' అంటే ఏమిటి? కార్గిల్‌ యుద్ధంలో ఇది ఎలా సాగింది? ఇందులో కీలకంగా వ్యవహరించిన 'గోల్డెన్‌ యారోస్‌' ఎవరు? యుద్ధ సమయంలో భారత్‌కు ఇజ్రాయెల్‌ ఎలా సహకరించింది? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాలు 

14 వేల అడుగుల ఎత్తు నుంచి శత్రు స్థావరాలపై దాడులు

లద్దాఖ్‌లోని కార్గిల్‌, ద్రాస్‌, బటాలిక్‌ సెక్టార్లలోకి పాక్‌ బలగాలు చొరబడి పర్వత ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి.

వాటిని తరిమికొట్టేందుకు 1999 మేలో భారత సైన్యం 'ఆపరేషన్‌ విజయ్‌' ప్రారంభించింది.

భూదళాల చర్యలకు వైమానిక మద్దతు అందించేందుకు భారత వాయుసేన 'ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌' చేపట్టింది.

ఈ ఆపరేషన్‌లో బఠిండాకు చెందిన వాయుసేన 17వ స్క్వాడ్రన్‌ 'ది గోల్డెన్‌ యారోస్‌'ను రంగంలోకి దించారు.

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మిషన్లు నిర్వహించడంలో ఈ స్క్వాడ్రన్‌కు అనుభవం ఉంది.

కార్గిల్‌ యుద్ధ సమయంలో కొన్ని సందర్భాల్లో భారత యుద్ధ విమానాలు 14 వేల నుంచి 18 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాల్సి వచ్చింది.

వివరాలు 

లేజర్‌ గైడెడ్‌ బాంబులతో టైగర్‌ హిల్స్‌పై దాడి

అంత ఎత్తులో మంచుతో కప్పుకున్న పర్వతాలపై ఉన్నశత్రు స్థావరాలను గుర్తించడం, వాటిని కచ్చితంగా లక్ష్యంగా చేసుకోవడం అంత సులభం కాదు. అయినప్పటికీ గోల్డెన్‌ యారోస్‌ పైలట్లు ఈ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నారు.

ఎత్తైన ప్రాంతాల్లోని పాక్‌ స్థావరాలు,ఆయుధ నిల్వలు,సరఫరా కేంద్రాలను గుర్తించి భారీ దాడులు చేశారు.

కార్గిల్‌లో కీలకమైన టైగర్‌ హిల్స్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో గోల్డెన్‌ యారోస్‌ అందించిన వైమానిక మద్దతు భారత సైన్యానికి ఎంతో ఉపయోగపడింది.

ఈ క్రమంలో భారత వాయుసేన మిరేజ్‌ 2000 యుద్ధవిమానాలను రంగంలోకి దించింది.

1999 జూన్‌ 24న వింగ్‌ కమాండర్‌ రఘునాథ్‌ నంబియార్‌ తన మిరేజ్‌ ఫైటర్‌ జెట్‌ నుంచి లేజర్‌ గైడెడ్‌ బాంబును టైగర్‌ హిల్స్‌పై ఉన్న పాక్‌ ఆర్మీ స్థావరంపై ప్రయోగించారు.

ADVERTISEMENT

వివరాలు 

ఇజ్రాయెల్‌ అందించిన సహకారం కీలకం

కొద్దిసేపటికే లక్ష్యం పూర్తిగా ధ్వంసమైంది. కార్గిల్‌ యుద్ధంలో భారత వాయుసేన లేజర్‌ గైడెడ్‌ ఆయుధాలను విజయవంతంగా ఉపయోగించడం ఇదే తొలిసారి.

ఈ అనూహ్య దాడి పాక్‌ బలగాలకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. అనంతరం రెండు రోజులకే కార్గిల్‌ యుద్ధంలో విజయం సాధించినట్లు భారత్‌ సగర్వంగా ప్రకటించింది.

అయితే ఈ విజయానికి మరో కీలక నేపథ్యం ఉంది. ఆపరేషన్‌ ప్రారంభమైన సమయంలో భారత్‌ వద్ద లేజర్‌ గైడెడ్‌ ఆయుధ వ్యవస్థకు సంబంధించిన అన్ని సాంకేతిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు.

ఈ సమయంలో ఇజ్రాయెల్‌ అందించిన సహకారం కీలకంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు 

లేజర్‌ బాంబుల వెనుక 'లైటెనింగ్‌ పాడ్‌'

లేజర్‌ గైడెడ్‌ బాంబుల వ్యవస్థలో 'లైటెనింగ్‌ లేజర్‌ డెజిగ్నేటర్‌ పాడ్‌' అత్యంత ముఖ్యమైన భాగం. దీన్ని ఉపయోగించినప్పుడు కంటికి కనిపించని లేజర్‌ కిరణం లక్ష్యాన్ని గుర్తిస్తుంది.

ఆ లేజర్‌ గుర్తింపును అనుసరించి బాంబు తన లక్ష్యం వైపు ప్రయాణిస్తుంది. భారత్‌ ఈ లైటెనింగ్‌ పాడ్‌లను ఇజ్రాయెల్‌ నుంచి కొనుగోలు చేసింది.

కార్గిల్‌ యుద్ధానికి రెండేళ్ల ముందు, 1997లో ఈ పాడ్‌ల కోసం భారత్‌, ఇజ్రాయెల్‌ మధ్య ఒప్పందం జరిగింది.

జాగ్వర్‌ విమానాల్లో అమర్చేందుకు 15 పాడ్‌లు, మిరేజ్‌ 2000 స్క్వాడ్రన్‌ కోసం మరో ఐదు పాడ్‌లను భారత్‌ ఆర్డర్‌ చేసింది.

వివరాలు 

లేజర్‌ బాంబుల వెనుక 'లైటెనింగ్‌ పాడ్‌'

వీటిని అమెరికా అందించిన పేవ్‌వే లేజర్‌ గైడెడ్‌ బాంబ్‌ కిట్లకు అనుసంధానం చేయాల్సి ఉంది.

అయితే పోఖ్రాన్‌ అణు పరీక్షల తర్వాత భారత్‌, అమెరికా మధ్య ఏర్పడిన విభేదాల ప్రభావం ఈ వ్యవస్థపైనా పడింది.

బాంబులను లేజర్‌ బీమ్‌తో అనుసంధానించేందుకు అవసరమైన ఫ్యూజ్‌లు భారత్‌కు అందలేదు.

మరోవైపు 1985లో ఫ్రాన్స్‌ నుంచి మిరేజ్‌ విమానాలను కొనుగోలు చేసిన తర్వాత వాటి సాఫ్ట్‌వేర్‌ను కూడా అప్‌గ్రేడ్‌ చేయలేదు.

దీంతో లేజర్‌ గైడెడ్‌ బాంబులను మిరేజ్‌ యుద్ధ విమానాలకు అనుసంధానం చేయడం సవాలుగా మారింది.

వివరాలు 

12 రోజుల పాటు భారత్‌లోనే ఇజ్రాయెల్‌ నిపుణులు

ఈ పరిస్థితుల్లో భారత్‌ ఇజ్రాయెల్‌ సాయం తీసుకున్నట్లు ఎయిర్‌ మార్షల్‌ నంబియార్‌ ఓ సందర్భంలో వెల్లడించారు.

యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌ నుంచి సాంకేతిక నిపుణుల బృందం భారత్‌కు వచ్చింది. భారత వాయుసేన అధికారులతో కలిసి ఈ బృందం అవసరమైన సాంకేతిక పనులు పూర్తి చేసింది.

దాదాపు 12 రోజుల పాటు ఈ నిపుణులు బెంగళూరు, గ్వాలియర్‌లో ఉండి లేజర్‌ గైడెడ్‌ బాంబులకు లైటెనింగ్‌ పాడ్‌లను అనుసంధానించారు.

దీంతో మిరేజ్‌ 2000 యుద్ధ విమానాలను లేజర్‌ గైడెడ్‌ బాంబులతో దాడులు చేసేలా సిద్ధం చేశారు.

ఆ తర్వాత 16,600 అడుగుల ఎత్తులో ఉన్న టైగర్‌ హిల్స్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.

వివరాలు 

550 స్ట్రైక్‌ మిషన్లు.. 2,100కుపైగా హెలికాప్టర్‌ సార్టీలు

లక్ష్యానికి సుమారు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే లేజర్‌ బీమ్‌ను ప్రయోగించారు. ఆ గుర్తింపును అనుసరించిన 600 కిలోల బాంబు నిర్ణీత మార్గంలో దూసుకెళ్లి పాక్‌ స్థావరాన్ని ధ్వంసం చేసింది.

సరైన సమయంలో ఇజ్రాయెల్‌ అందించిన సాంకేతిక సహకారం లేకపోతే ఆపరేషన్‌ను పూర్తి చేయడం చాలా కష్టమయ్యేదని ఎయిర్‌ మార్షల్‌ నంబియార్‌ ఓ సందర్భంలో పేర్కొన్నారు.

కార్గిల్‌ యుద్ధ సమయంలో భారత వాయుసేన భారీ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించింది. మొత్తంగా 550 స్ట్రైక్‌ మిషన్లు, 150 నిఘా సార్టీలు, 500కుపైగా ఎస్కార్ట్‌ మిషన్లు, 2,100కుపైగా హెలికాప్టర్‌ సార్టీలను చేపట్టింది.

వివరాలు 

550 స్ట్రైక్‌ మిషన్లు.. 2,100కుపైగా హెలికాప్టర్‌ సార్టీలు

ముంతో ధాలో ప్రాంతంలో పాక్‌ బలగాలకు ఉన్న సరఫరా స్థావరాన్ని ధ్వంసం చేయడం ద్వారా శత్రు సేనలకు గట్టి దెబ్బ తగిలింది.

అనంతరం టైగర్‌ హిల్స్‌తో పాటు ఇతర కీలక ప్రాంతాల్లోని పాక్‌ సైనిక స్థావరాలపై కూడా భారత వాయుసేన దాడులు చేసింది.

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌లో భాగంగా పాక్‌ బలగాలకు అందుతున్న సరఫరా మార్గాలను ధ్వంసం చేయడంతో వారి పోరాట సామర్థ్యం, మనోధైర్యం దెబ్బతిన్నాయి.

ఫలితంగా భారత పదాతిదళానికి కీలకమైన పర్వత స్థావరాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం మరింత సులభమైంది.

అయితే ఈ ఆపరేషన్‌లో భారత వాయుసేన కూడా భారీ మూల్యం చెల్లించింది. ఎంఐ-17 హెలికాప్టర్‌, మిగ్‌-21తో పాటు స్క్వాడ్రన్‌ లీడర్‌ అజయ్‌ అహుజా సహా పలువురు సిబ్బందిని కోల్పోయింది.

వివరాలు 

రియల్‌ లైఫ్‌ 'గోల్డెన్‌ యారోస్‌' వీరులు

గోల్డెన్‌ యారోస్‌ స్క్వాడ్రన్‌కు వింగ్‌ కమాండర్‌ బీఎస్‌ ధనోవా నాయకత్వం వహించారు.

టోలోలింగ్‌, టైగర్‌ హిల్స్‌ వంటి కీలక ప్రాంతాల్లో ఆయన స్వయంగా మిషన్లలో పాల్గొన్నారు.

కార్గిల్‌ ఆపరేషన్‌ అనంతరం ధనోవా వాయుసేనలో ఉన్నత స్థాయికి ఎదిగారు. 2016లో భారత వాయుసేన అధిపతిగా బాధ్యతలు చేపట్టారు.

స్క్వాడ్రన్‌ లీడర్‌ అజయ్‌ అహుజా ఈ బృందానికి ఫ్లైట్‌ కమాండర్‌గా వ్యవహరించారు.

ఓ మిషన్‌లో తన సహచర పైలట్‌ గల్లంతవడంతో అతడిని వెతికేందుకు అహుజా వెళ్లారు. ఆ సమయంలో ఆయన మిగ్‌-21 పాక్‌ క్షిపణి దాడికి గురైంది.

వివరాలు 

రియల్‌ లైఫ్‌ 'గోల్డెన్‌ యారోస్‌' వీరులు

విమానం నుంచి సురక్షితంగా బయటపడిన అహుజాను పాక్‌ దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

అనంతరం ఆయనపై చిత్రహింసలకు పాల్పడి హత్య చేసినట్లు భారత వర్గాలు వెల్లడించాయి. ఆయన ధైర్యసాహసాలకు మరణానంతరం 'వీర్‌ చక్ర' పురస్కారం లభించింది.

ఈ స్క్వాడ్రన్‌లో యువ ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ రాజ్‌పాల్‌ సింగ్‌ ధలీవాల్‌ కూడా కీలక పాత్ర పోషించారు.

అప్పటికి పూర్తిస్థాయి అనుభవం లేకపోయినా రాత్రివేళ నిర్వహించే వైమానిక ఆపరేషన్లలో ధైర్యంగా పాల్గొన్నారు.

కార్గిల్‌ యుద్ధం తర్వాత వింగ్‌ కమాండర్‌ స్థాయికి ఎదిగి సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ టీమ్‌తో కలిసి పనిచేశారు. అయితే 2009లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

వివరాలు 

రియల్‌ లైఫ్‌ 'గోల్డెన్‌ యారోస్‌' వీరులు

ఇక ఫ్లయింగ్‌ ఆఫీసర్లు సీహెచ్‌ బాల్‌రెడ్డి, అమిత్‌ గుప్తా, ఫ్లయిట్‌ లెఫ్టినెంట్‌ జితేంద్ర సంగ్వాన్‌ తదితరులు కూడా గోల్డెన్‌ యారోస్‌ బృందంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

కార్గిల్‌ యుద్ధంలో భారత సైన్యానికి భూమిపై 'ఆపరేషన్‌ విజయ్‌' ఎంత కీలకమో.. ఆ దళాలకు ఆకాశం నుంచి అండగా నిలిచిన 'ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌' కూడా అంతే ముఖ్యమైనది.

అత్యంత ఎత్తైన ప్రాంతాలు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, పరిమిత సాంకేతిక వనరుల మధ్య భారత వాయుసేన సాధించిన ఈ విజయంలో గోల్డెన్‌ యారోస్‌ వీరత్వంతో పాటు ఇజ్రాయెల్‌ అందించిన సాంకేతిక సహకారం కూడా కీలక అధ్యాయంగా నిలిచింది.

ADVERTISEMENT