LOADING...
Priyanka Gandhi: రాజధానిలో శ్వాస తీసుకోవడమే కష్టంగా మారింది.. ప్రియాంక గాంధీ ఆవేదన!
రాజధానిలో శ్వాస తీసుకోవడమే కష్టంగా మారింది.. ప్రియాంక గాంధీ ఆవేదన!

Priyanka Gandhi: రాజధానిలో శ్వాస తీసుకోవడమే కష్టంగా మారింది.. ప్రియాంక గాంధీ ఆవేదన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2025
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) రోజు రోజుకు ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. కొన్ని రోజులుగా అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ట్విటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), దిల్లీ సీఎం రేఖా గుప్తాను ట్యాగ్‌ చేస్తూ స్పందించారు. బిహార్‌లో ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకుని దిల్లీకి తిరిగి వచ్చిన ప్రియాంక గాంధీ, రాజధానిలో నెలకొన్న కాలుష్య పరిస్థితిని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారని తెలిపారు. రాజకీయ భేదాలు పక్కన పెట్టి, దేశంలోని అన్ని రాజకీయ నాయకులు కలసి ఈ సమస్యను ఎదుర్కోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు.

Details

తాము మద్దతుగా నిలుస్తాం

ఈ భయానక వాతావరణ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలకు తాము మద్దతుగా నిలుస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. ప్రతేడాది దిల్లీ ప్రజలు విషపూరిత వాయువులను పీలుస్తూ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు. "మేమంతా ఈ విష వాయువునే పీల్చుకుంటున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రెండు వారాలుగా దిల్లీ గాలి నాణ్యత తీవ్రంగా దిగజారిందని, ఆదివారం కూడా అదే పరిస్థితి కొనసాగిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) వెల్లడించింది. అనేక ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ (AQI) 400 మార్క్‌ దాటిపోయిందని అధికారులు తెలిపారు.