తెలుగునాట రాజకీయ నవోదయం: సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40ఏళ్లు
నందమూరి తారకరామారావు.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశానికే కాదు.. ప్రపంచానికి చాటిన నాయకుడు. టీడీపీని స్దాపించిన కేవలం 9నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనుడు. సరిగ్గా 40ఏళ్ల క్రితం ఇదే రోజున జనవరి 9న తెలుగునాట తొలిసారి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించిన ప్రజానాయకుడు ఎన్టీఆర్. ఇదే రోజున ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి.. ఉమ్మడి రాష్ట రాజకీయాల్లో కొత్త శఖాన్ని పూరించారు. సినిమాల్లో తిరుగులేని కథానాయకుడిగా వెలిగిపోయిన ఎన్టీఆర్.. రాజకీయాల్లో కూడా తనదైన ముద్రను వేసుకున్నారు. అప్పటి వరకు రాజకీయ ప్రాధాన్యం లేని బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేశారు. విద్యావంతులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు.
టీడీపీ పుట్టడానికి బీజం అదే..
ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్‌గాంధీ అప్పటి ముఖ్యమంత్రి అంజయ్యను ఎయిర్‌పోర్టులో అవమానించిన ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ఇది ఎన్టీఆర్ మనసును కలిచివేసింది. తర్వాత జరిగిన అనేక ఘటనల నేపథ్యంలో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పార్టీని పెట్టాలని నిర్ణయించారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ప్రకటించారు. చైతన్య రథంపై ఊరూవాడ తిరిగి.. అప్పటికి, ఇప్పటికి ఎవరికి సాధ్యం కాని రీతిలో కేవలం 9నెలల్లోనే పార్టీని అధికారంలో తీసుకొచ్చి ప్రభంజనం సృష్టించారు. జనవరి 9న తెలుగు రాజకీయాల్లో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్. అప్పటి వరకు ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం రాజ్‌భవన్‌లో జరిగేది. ఎన్టీఆర్ మాత్రం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం కూడా తెలుగులోనే చేసి అందరనీ ఆశ్చర్యపరిచారు.