Sneha Group IT Raids: స్నేహా గ్రూప్‌పై ఐటీ దాడులు.. తెలంగాణ, ఏపీలో 16 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు!
ఈ వార్తాకథనం ఏంటి
పౌల్ట్రీ, అగ్రి బిజినెస్ రంగాల్లో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్నేహా గ్రూప్ (Sneha Group)పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. శుక్రవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఆ సంస్థకు సంబంధించిన మొత్తం 16 ప్రాంతాల్లో ఐటీ బృందాలు ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్, విజయవాడతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో ఉన్న స్నేహా గ్రూప్ ప్రధాన కార్యాలయాలు, కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లో విస్తృతంగా సోదాలు జరిపారు.
వివరాలు
1982లో చిన్న వ్యాపారంగా ప్రారంభం
స్నేహా గ్రూప్‌నకు చెందిన ప్రధాన సంస్థ 'స్నేహా ఫామ్స్' (Sneha Farms) హైదరాబాద్‌లోని కొండాపూర్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
ఈ సంస్థకు రామ్ రెడ్డి దేండి, వరుణ్ రెడ్డి దేండి, స్నేహ దేండి డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు.
1982లో 'రామ్ రెడ్డి చికెన్ మార్కెట్' పేరుతో చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ వ్యాపారం.. 1994లో స్నేహా ఫామ్స్‌గా రిజిస్టర్ అయింది.
అనంతరం అంచెలంచెలుగా విస్తరిస్తూ పౌల్ట్రీ బ్రీడింగ్, చికెన్ ప్రాసెసింగ్, పశువుల దాణా (యానిమల్ ఫీడ్) తయారీ, వంట నూనెలు, సోయా ఉత్పత్తుల రంగాల్లో ప్రముఖ సంస్థగా ఎదిగింది.
వివరాలు
2,000 మందికి పైగా కాంట్రాక్ట్ రైతులతో వ్యాపారం
స్నేహా గ్రూప్ ఆధ్వర్యంలో బ్రీడింగ్ ఫామ్స్, హ్యాచరీలు, కమర్షియల్ బ్రాయిలర్, లేయర్ ఫామ్స్ నిర్వహిస్తున్నారు.
ఈ సంస్థ 2,000 మందికి పైగా కాంట్రాక్ట్ రైతులతో కలిసి పనిచేస్తోంది. తెలంగాణలో గంటకు 12,000 కోళ్లను ప్రాసెస్ చేయగల సామర్థ్యం కలిగిన ఆటోమేటెడ్ చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను కూడా నిర్వహిస్తోంది.
అంతేకాకుండా 2012 నుంచి భారత రక్షణ శాఖకు చెందిన సంస్థలకు ఫ్రోజెన్ చికెన్‌ను సరఫరా చేస్తోంది.
పౌల్ట్రీ రంగంతో పాటు ప్రత్యేక ఫీడ్ మిల్లుల ద్వారా కోళ్లు, చేపలకు అవసరమైన దాణాను కూడా తయారు చేస్తోంది.
వివరాలు
సఫల బ్రాండ్‌తో సోయా ఉత్పత్తులు
సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్, రిఫైనింగ్ ప్రక్రియల ద్వారా వంట నూనెల వ్యాపారంలోనూ స్నేహా గ్రూప్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. 'సఫల' (Saphala) బ్రాండ్ పేరుతో సోయా ఉత్పత్తులను విక్రయిస్తోంది.
'స్నేహా గోల్డ్ ప్రోటీన్స్' కూడా ఈ గ్రూప్ అనుబంధ సంస్థల్లో ఒకటిగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 'సింగ్ పౌల్ట్రీ'ని కొనుగోలు చేయడం ద్వారా తమ బ్రీడర్ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంది.
బ్రాయిలర్ వ్యాపారంలో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు జపాన్‌కు చెందిన 'మిట్సుయ్ అండ్ కో' (Mitsui & Co) సంస్థ కూడా ఆసక్తి చూపింది.
వివరాలు
వ్యాపార కార్యకలాపాలపై ఐటీ సోదాలు
పౌల్ట్రీ నుంచి వంట నూనెలు, సోయా ఉత్పత్తుల వరకు విస్తరించిన స్నేహా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యంపై ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.