Odisha: ఒడిశాలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఆరుగురి దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన వ్యక్తిని రక్షించేందుకు వెళ్లిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలోని కాళహండి జిల్లా ఎం.రాంపూర్ మండల పరిధిలోని గౌడ కర్లాకుంట గ్రామంలో చోటుచేసుకుంది. ట్యాంక్‌కు వేసిన సెంట్రింగ్‌ను తొలగించేందుకు ముందుగా ఓ మేస్త్రీ లోపలికి దిగగా, ప్రమాదవశాత్తూ అతడు అపస్మారక స్థితికి చేరాడు. ఇది గమనించిన మరో ఐదుగురు అతడిని బయటకు తీసేందుకు ఒక్కొక్కరుగా ట్యాంక్‌లోకి దిగారు. అయితే లోపల విషవాయువులు వ్యాపించి ఉండటంతో వారందరికీ ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వివరాలు
మృతుల్లో తండ్రీకొడుకులు
సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి బాధితులను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆరుగురు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో వ్యక్తి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో ముగ్గురు మేస్త్రీలు, ఓ కార్మికుడు, ఇంటి యజమాని, అతని కుమారుడు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి దారితీసిన కారణాలు, భద్రతా లోపాలపై విచారణ కొనసాగిస్తున్నారు.
వివరాలు
ముఖ్యమంత్రి సంతాపం
ఒడిశాలో జరిగిన సెప్టిక్ ట్యాంక్ విషాద ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ సహాయాన్ని వెంటనే విడుదల చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.