Amarnath: అమర్‌నాథ్ యాత్రికుల బస్సు బోల్తా: 39 మందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలో అమర్‌నాథ్ యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మొత్తం 39 మంది యాత్రికులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. కంగన్ ప్రాంతంలోని హరిగన్వాన్ సమీపంలో మలుపు తిరుగుతున్న సమయంలో డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో మరింత పెద్ద విషాదం తప్పింది. బస్సు ఢీకొట్టిన ప్రభావంతో ఇల్లు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, అదే ఇల్లు బస్సు సింధు నదిలోకి దూసుకెళ్లకుండా అడ్డుకట్టగా నిలిచింది.
వివరాలు
గాయపడిన యాత్రికులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జమ్ముకశ్మీర్ పోలీసులు, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), భారత సైన్యం సిబ్బంది, స్థానిక ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు.
గాయపడిన యాత్రికులను ఆలస్యం చేయకుండా సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
వైద్యుల సమాచారం ప్రకారం క్షతగాత్రులందరి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.
ఎక్కువ మంది యాత్రికులకు స్వల్ప గాయాలే కావడంతో వారికి అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు భక్తుల నుంచి విశేష స్పందన
ఈ ఘటనపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గందర్‌బాల్ డిప్యూటీ కమిషనర్, ఆరోగ్య శాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించిన ఆయన, గాయపడిన యాత్రికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కాగా, జూలై 2న ప్రారంభమైన ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఇప్పటివరకు 4.15 లక్షలకు పైగా మంది భక్తులు పవిత్ర మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆగస్టు 28తో ఈ వార్షిక అమర్‌నాథ్ యాత్ర ముగియనుంది.