Jagan: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. ఈడీ కేసులపై రోజువారీ విచారణకు నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసుల్లో కీలక ముందడుగు పడింది. ఈ కేసులకు సంబంధించి సీబీఐ కోర్టు రోజువారీ విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటివరకు సీబీఐ కేసులకే పరిమితమైన విచారణను, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులకూ వర్తింపజేయాలని న్యాయస్థానం నిర్ణయించింది. ఈడీ కేసుల విచారణకు న్యాయవాదులు రోజూ హాజరుకావాలని సూచించింది. సీబీఐ కోర్టులో గత పదేళ్లుగా ఈడీకి సంబంధించిన తొమ్మిది ఛార్జిషీట్లు పెండింగ్లో ఉన్నాయి. నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లు ఇంకా పరిష్కారం కాకపోవడంతో ఈడీ కేసుల విచారణ ముందుకు సాగడం లేదు. దీంతో ఈ కేసుల పరిష్కారంలో జాప్యం కొనసాగుతోంది.
వివరాలు
సీబీఐ కోర్టు తాజాగా రోజువారీ విచారణకు నిర్ణయం
ఈడీ కేసులను కూడా రోజువారీగా విచారించాలని కోరుతూ అధికారులు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు.
ఇప్పటివరకు సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణ మాత్రమే జరుగుతోందని, తమ కేసులపైనా విచారణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని ఈడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసులను త్వరగా పరిష్కరించేలా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించాలని కోరింది.
ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు తాజాగా రోజువారీ విచారణకు నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయంతో జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించి పెండింగ్లో ఉన్న ఈడీ కేసుల విచారణ కూడా వేగవంతమయ్యే అవకాశం ఉంది.
సోమవారం నుంచి ఈడీ కేసుల విచారణ ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.