కెనడాలో ఇందిరా గాంధీ హత్యోదంత శకటం ప్రదర్శన; ఖండించిన జైశంకర్
కెనడాలోని బ్రాంప్టన్‌లో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి ఘోర అవమానం జరిగింది. ఖలిస్థానీ మద్దతుదారులు మరీ దారుణంగా ప్రవర్తించారు. ఇందిరా గాంధీ హత్యోదంతాన్ని వర్ణిస్తూ తయారు చేసిన శకటాన్ని కెనడాలో ఖలిస్థానీ అనుకూల శక్తులు ప్రదర్శించాయి. అమె హత్య జరిగిన రోజును ఒక వేడుకగా చేసుకున్నాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయంపై భారత్ తీవ్రంగా స్పందించింది. శకటం ఊరేగింపు వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే ఈ ప్రదర్శనను కెనడా అడ్డుకోకపోవడంపై భారత విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్ తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలే కాకుండా వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు కెనడా ఎందుకు స్థానం ఇస్తుందో అర్థం చేసుకోవడంలో భారత్ విఫలమైందని జైశంకర్ మండిపడ్డారు.
కెనడా అధికారుల ఉదాసీనతపై భారత్ అసహనం
ఇందిరా గాంధీని ఆమె సిక్కు అంగరక్షకులు హత్య చేయడాన్ని వర్ణిస్తున్న శకటంతో కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్థానీ మద్దతుదారులు 5కిమీల మేర కవాతు చేశారు. జూన్ 6న 'ఆపరేషన్ బ్లూ స్టార్' 39వ వార్షికోత్సవానికి ముందు, జూన్ 4న ఖలిస్తాన్ మద్దతుదారులు బ్రాంప్టన్‌లో కవాతను నిర్వహించారు. ఈ ఘటనపై బుధవారం కెనడా ప్రభుత్వానికి భారత్ అధికారికంగా తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ సంఘటన ఆమోదయోగ్యం కాదని ఒట్టావాలోని భారత హైకమిషన్ గ్లోబల్ అఫైర్స్ పేర్కొంది. భారతదేశంలోని కెనడియన్ హైకమీషనర్ కామెరాన్ మాకే కూడా కెనడా అధికారుల ఉదాసీనతను ఖండించారు.