
Guntur: గుంటూరు పేదల డాక్టర్‌కి జమైకా అత్యున్నత పురస్కారం
ఈ వార్తాకథనం ఏంటి
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధ వైద్య నిపుణుడు చందోలు నాగమల్లేశ్వరరావుకు జమైకా దేశంలో అరుదైన గౌరవం లభించింది. అక్టోబర్ 20న నిర్వహించిన జమైకా నేషనల్ హీరోస్ డే సందర్భంగా, ఆ దేశ ప్రధాని ఆండ్రూ హోల్నెస్ స్వయంగా 'ఆర్డర్ ఆఫ్ డిస్టింక్షన్ (ఆఫీసర్ ర్యాంక్ - OD)' అనే ప్రతిష్ఠాత్మక అవార్డును ఆయనకు అందజేశారు. జమైకాలో తక్కువ ఫీజులతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ, డాక్టర్ నాగమల్లేశ్వరరావు అక్కడ "ఫైవ్ బిల్స్ డాక్టర్" అనే పేరుతో ప్రసిద్ధి పొందారు. ఆయనకు ఈ గౌరవం లభించిన సందర్భంగా కింగ్‌స్టన్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా అభినందనలు తెలిపింది. బాపట్ల జిల్లా, నగరం మండలం, బెల్లంవారిపాలెం గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరరావు సామాన్య కుటుంబంలో జన్మించారు.
వివరాలు
"పేదల డాక్టర్"గా పేరు
ఆయన తండ్రి రిక్షా తొక్కేవారు,తల్లిదండ్రులు నిరక్షరాస్యులే అయినా,పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించాలని పట్టుదలగా ప్రోత్సహించారు. నాగమల్లేశ్వరరావు చిలకలూరిపేట మండలం మద్దిరాల నవోదయ పాఠశాలలో ఇంటర్మీడియట్ వరకుచదివి, అనంతరం ఎన్‌టిఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నుండి వైద్య విద్య పూర్తి చేశారు. 2005లో జమైకా వెళ్లిన ఆయన, అక్కడ పేద ప్రజలకు వైద్యం అందిస్తూ "పేదల డాక్టర్"గా పేరు సంపాదించారు. ఆయన స్థాపించిన 'చందోలు గ్లోబల్ హెల్త్‌కేర్ ప్రాక్టీస్' అనే సంస్థ ద్వారా పలు వైద్య శిబిరాలు నిర్వహిస్తూ, ఆ దేశంలోనే అత్యంత తక్కువ కన్సల్టేషన్ ఫీజులు వసూలు చేసే వైద్యుడిగా గుర్తింపు పొందారు. ఈ విధంగా, తన సేవా దృక్పథం, వినమ్రత, కష్టపడే తత్వం వల్ల చందోలు నాగమల్లేశ్వరరావు జమైకాలో భారతీయుల గర్వకారణంగా నిలిచారు.