Jammu Kashmir Portfolios: పోర్ట్‌ఫోలియోలను కేటాయించిన ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం.. ఎవరెవరికి ఏఏ శాఖలంటే..?
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శుక్రవారం శాఖలను కేటాయించారు. ముఖ్యమంత్రి సలహా మేరకు శాఖల కేటాయింపుకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం,ఉప ముఖ్యమంత్రి సురీందర్ కుమార్ చౌదరి ప్రజా పనుల(ఆర్ అండ్ బి), పరిశ్రమలు,వాణిజ్యం,మైనింగ్, కార్మిక ఉపాధి -నైపుణ్య అభివృద్ధి వంటి బాధ్యతలను నిర్వహించనున్నారు. ఇక ఏకైక మహిళా మంత్రి సాకినా మసూద్ కు ఆరోగ్య, వైద్య విద్య, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంఘిక సంక్షేమం వంటి కీలకమైన శాఖల బాధ్యతలు అప్పగించబడ్డాయి. అబ్దుల్లా మొదటి సారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.
ఇతర విభాగాలు ముఖ్యమంత్రి వద్దే
జావేద్ అహ్మద్ రాణాకు జల్ శక్తి, అటవీ, పర్యావరణ, గిరిజన వ్యవహారాల శాఖలు కేటాయించబడ్డాయి. జావేద్ అహ్మద్ దార్ వ్యవసాయ ఉత్పత్తి, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, సహకార, ఎన్నికల మంత్రిగా పనిచేయనున్నారు. సతీష్ శర్మకు ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, రవాణా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యువత సేవలు, క్రీడలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఇన్స్పెక్షన్, ట్రైనింగ్, గ్రీవెన్సెస్ డిపార్ట్‌మెంట్ (ఏఆర్ఐ) వంటి విభాగాల బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఏ మంత్రికీ కేటాయించని ఇతర విభాగాలు ముఖ్యమంత్రి వద్దనే ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.