Janasena: తెలంగాణలో జనసేన కీలక నిర్ణయం.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావును ఈ స్థానం నుంచి పోటీ చేయిస్తున్నట్లు వెల్లడించింది. ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ఈ విషయాన్ని ప్రకటించారు.
వివరాలు
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం ఇదే తొలిసారి
ప్రస్తుతం జనసేన తెలంగాణ అధికార ప్రతినిధిగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్న గడల శ్రీనివాసరావు అభ్యర్థిత్వానికి పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపినట్లు తాళ్లూరి రామ్ తెలిపారు.
తెలంగాణలో శాసనమండలి స్థానానికి జనసేన తరఫున అభ్యర్థిని బరిలోకి దింపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
2027 మార్చి తర్వాత ఈ ఎమ్మెల్సీ ఎన్నిక జరిగే అవకాశం ఉండగా.. ఇతర ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించకముందే జనసేన నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
సెప్టెంబర్ 13న ఖమ్మంలో 'జనసేన-శంఖారావం'
ఈ సందర్భంగా డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పట్టభద్రులు, ఉద్యోగులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను శాసనమండలిలో బలంగా ప్రస్తావిస్తానని చెప్పారు.
ఆయా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం ఖాయమనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణపై చర్చించేందుకు సెప్టెంబర్ 13న ఖమ్మంలో 'జనసేన-శంఖారావం' పేరుతో భారీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు జనసేన సిద్ధమవుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ పరిణామాన్ని తెలంగాణలో జనసేన రాజకీయ విస్తరణకు తొలి అడుగుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.