Glass Symbol: జనసేన గ్లాస్ గుర్తు.. హైకోర్టులో జనసేనకి చుక్కెదురు..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జనసేన పార్టీకి చుక్కెదురైంది. గ్లాసు గుర్తును రిజర్వ్ చేయలేమంటూ ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైందని,ఇటువంటి సమయంలో గుర్తుని మార్చలేమని తేల్చి చెప్పింది. జనసేన పిటిషన్ కు విచారణ అర్హత లేదని ఎన్నికల సంఘం పేర్కొంది. పిటిషనర్ కోరిన విధంగా చేస్తే ఎన్నికలు జరిగేంత వరకు పిటిషన్లు వస్తూనే ఉంటాయని తెలిపింది. ఎలక్ట్రానిక్ బ్యాలెట్లను ఇప్పటికే ఆర్మ్డ్ ఫోర్స్ కు పంపించామని ఈసీ కోర్టుకు తెలిపింది .
వర్ల రామయ్య ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్
ప్రీ పోల్ అలయన్స్ ను గుర్తించాలని చట్టబద్ధత లేదని కోర్టుకు ఈసీ తెలిపింది. జనసేన పార్టీ తెలిపిన అభ్యంతరాలపై బుధవారమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు వెల్లడించింది. తెలుగుదేశం నాయకుడు వర్ల రామయ్య ఆధ్వర్యంలో కూటమి సభ్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాసును ఎవరికీ కేటాయించొద్దని వర్ల రామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనంతరం, ఏపీ హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.