LOADING...
Japan bans Indian mangoes again: భారత మామిడిపై జపాన్ బ్యాన్.. కారణం ఏంటంటే?
భారత మామిడిపై జపాన్ బ్యాన్.. కారణం ఏంటంటే?

Japan bans Indian mangoes again: భారత మామిడిపై జపాన్ బ్యాన్.. కారణం ఏంటంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2026
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మామిడి పండ్లపై జపాన్ మరోసారి నిషేధం విధించింది. 2006లో రెండు దశాబ్దాల నిషేధం ఎత్తివేసిన తర్వాత దాదాపు 20 ఏళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతున్న ఎగుమతులకు ఇప్పుడు బ్రేక్ పడింది. 2026 మామిడి సీజన్‌కు భారత నుంచి తాజా మామిడి దిగుమతులను జపాన్ నిలిపివేసింది. ఏ మామిడి రకాలపై ప్రభావం? జపాన్ క్వారంటైన్ అధికారులు మార్చిలో నిర్వహించిన తనిఖీల్లో భారత వాపర్ హీట్ ట్రీట్మెంట్‌ (VHT) కేంద్రాల్లో ఫ్యూమిగేషన్‌, డిస్ఇన్‌ఫెక్షన్‌ ప్రక్రియల్లో లోపాలు గుర్తించినట్లు తెలిపింది. దీంతో ఆల్ఫాన్సో, కేసర్‌, లంగ్రా, బంగినపల్లి వంటి ప్రధాన ఎగుమతి రకాలపై నిషేధం అమలైంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉండే కీలక ఎగుమతి సీజన్ మొత్తం ప్రభావితమైంది.

వివరాలు 

జపాన్ అధికారిక ప్రకటన

జపాన్ ప్లాంట్ క్వారంటైన్ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే యోకోహామా ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ మార్చి 31, 2026న అధికారిక నోటీసు జారీ చేసింది. మార్చి 25 తర్వాత భారత్ జారీ చేసిన ఇన్‌స్పెక్షన్ సర్టిఫికెట్లతో వచ్చే మామిడి సరుకులను స్వీకరించబోమని స్పష్టం చేసింది. భారత కేంద్రాల్లో ప్రమాణాలు మెరుగుపడ్డాయని జపాన్ అధికారులు సంతృప్తి చెందే వరకు నిషేధం కొనసాగుతుందని తెలిపింది.

వివరాలు 

తనిఖీల్లో ఏమి బయటపడింది?

ప్రతి ఏడాది మామిడి సీజన్‌కు ముందు జపాన్ అధికారులు భారత్‌లోని VHT కేంద్రాలను తనిఖీ చేస్తారు. మామిడి పండ్లలో ఉండే ఫ్రూట్ ఫ్లైలు, ఇతర పురుగులను తొలగించేందుకు రసాయనాలు ఉపయోగించకుండా వేడి, తేమ గాలితో చేసే ప్రక్రియనే VHT అంటారు. జపాన్‌కు ఎగుమతులకు ఇది తప్పనిసరి నిబంధన. ఈసారి ఉత్తరప్రదేశ్‌లోని రెహ్మాన్‌పూర్ VHT కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. అక్కడ ఫ్యూమిగేషన్‌, శానిటైజేషన్ విధానాల్లో లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం. అయితే అసలు సాంకేతిక లోపాలు ఏంటన్నది భారత్ గానీ, జపాన్ గానీ అధికారికంగా వెల్లడించలేదు.

Advertisement

వివరాలు 

2006లో ఎలా ఒప్పందం జరిగింది?

1986లో ఫ్రూట్ ఫ్లై సమస్యల కారణంగా జపాన్ భారత మామిడిపై మొదట నిషేధం విధించింది. అది 20 ఏళ్లు కొనసాగింది.చివరకు 2006 జూన్ 23న జపాన్ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది. భారత్-జపాన్ ద్వైపాక్షిక సంబంధాలకు ఇది ప్రతీకగా అప్పట్లో పేర్కొన్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఆమోదించిన VHT కేంద్రాల్లో ప్రాసెస్ చేసిన మామిడికే అనుమతి ఇచ్చారు. ఆల్ఫాన్సో, కేసర్‌, బంగినపల్లి, లంగ్రా, చౌసా, మాలికా రకాలకే ఎగుమతి అనుమతి ఉంది. ఈ నిబంధనలకు అనుగుణంగా భారత్ ప్రత్యేక VHT కేంద్రాలు ఏర్పాటు చేసింది. 2007లో తిరుపతిలో తొలి ప్రభుత్వ VHT ప్లాంట్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి సీజన్‌లో తనిఖీలు కొనసాగుతూ వచ్చాయి.

Advertisement

వివరాలు 

జపాన్ మార్కెట్ ఎంత ముఖ్యమంటే?

భారత మామిడి ఎగుమతుల్లో జపాన్ ప్రధాన మార్కెట్ కాదు. APEDA గణాంకాల ప్రకారం 2024-25లో భారత మామిడి ఎక్కువగా UAE, అమెరికా, బ్రిటన్‌, కువైట్‌, ఖతార్ దేశాలకు ఎగుమతి అయ్యింది. మొత్తం 29,938 మెట్రిక్ టన్నుల మామిడి ఎగుమతి చేసి సుమారు 56.5 మిలియన్ డాలర్ల ఆదాయం వచ్చింది. అయితే జపాన్ మార్కెట్ చిన్నదైనా విలువైనదిగా భావిస్తారు. 2025-26లో జపాన్‌కు తాజా, ప్రాసెస్డ్ మామిడి ఉత్పత్తుల ఎగుమతుల విలువ 1.54 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ముఖ్యంగా గుజరాత్ కేసర్ మామిడికి అక్కడ మంచి డిమాండ్ ఉంది.

వివరాలు 

ఎగుమతిదారులకు ఎందుకు పెద్ద దెబ్బ?

జపాన్ ప్రపంచంలో అత్యంత కఠిన వ్యవసాయ దిగుమతి నిబంధనలు అమలు చేసే దేశాల్లో ఒకటి. కానీ అక్కడ ధరలు ఎక్కువగా ఉండటంతో ఎగుమతిదారులకు మంచి లాభాలు వస్తాయి. అందుకే ఈ నిషేధం డాలర్ల పరంగా చిన్నదిగా కనిపించినా, వ్యాపారపరంగా పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. 2025లో జపాన్‌కు 2.5 టన్నుల మామిడి పంపిన ఎగుమతిదారు బేగ్ మాట్లాడుతూ.. "జపాన్ మార్కెట్ చాలా పెద్దది కాకపోయినా, ఈ సీజన్‌లో సరఫరా తక్కువగా ఉన్న సమయంలో అది కీలకమే" అని చెప్పారు.

వివరాలు 

ఇప్పటికే కష్టాల్లో మామిడి ఎగుమతులు

ఈసారి భారత మామిడి ఎగుమతులు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నాయి. మహారాష్ట్ర కోంకణ్ ప్రాంతంలో తీవ్ర ఎండల కారణంగా ఆల్ఫాన్సో దిగుబడులు భారీగా దెబ్బతిన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో అత్యంత విలువైన రకాలలో ఇది ఒకటి. ఇక పశ్చిమాసియాలో భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. దీంతో పాడయ్యే సరుకుల ఎగుమతులకు అదనపు భారమైంది.

వివరాలు 

ఇక ముందు ఏమవుతుంది?

జపాన్ ఎప్పుడు మళ్లీ అనుమతి ఇస్తుందన్న దానిపై స్పష్టత లేదు. భారత కేంద్రాల్లో ప్రమాణాలు మెరుగుపడ్డాయని తాము నమ్మే వరకు నిషేధం కొనసాగుతుందని మాత్రమే జపాన్ తెలిపింది. ప్రస్తుత సీజన్‌లోనే సమస్య పరిష్కారమవుతుందా లేదా అన్నది కూడా అనిశ్చితిగానే ఉంది. ఇప్పటివరకు జపాన్ ప్లాంట్ ప్రొటెక్షన్ స్టేషన్ గానీ, భారత APEDA గానీ అధికారిక చర్చలు లేదా పరిష్కార టైమ్‌లైన్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement