రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓగా జయవర్మ సిన్హా
రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓ, ఛైర్ పర్సన్ గా జయావర్మ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు కేబినేట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. ఈ బాధ్యతలు చేపట్టనున్న మొట్టమొదటి మహిళా అధికారి జయావర్మనే కావడం విశేషం. ఇండియన్ రైల్వే మేనేజిమెంట్ సర్వీసెస్ అధికారిణి అయిన జయావర్మ, ప్రస్తుతం రైల్వే బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి 2024 ఆగస్టు 31 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆమె సీఈఓ బాధ్యతలను చేపట్టనున్నారు. ఇప్పటి వరకూ రైల్వే బోర్డు సీఈఓగా అనిల్ కుమార్ లాహోటి కొనసాగారు.
రైల్వే సలహాదారుగా నాలుగేళ్ల పాటు పనిచేసిన జయావర్మ
అలహాబాద్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన జయావర్మ 1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ లో చేరారు. అదే విధంగా ఉత్తర, ఆగ్నేయ, తూర్పు రైల్వే జోన్ లలో వివిధ హోదాల్లో విధులు నిర్వహించి మంచిపేరును సంపాదించారు. ఢాకాలోని భారత హై కమిషన్ లో రైల్వే సలహాదారుగా నాలుగేళ్లపాటు పనిచేసిన అనుభవం అమెకు ఉంది. ఆ సమయంలోనే కోల్‌కతా నుంచి ఢాకాకు 'మైత్రీ ఎక్స్ ప్రెస్' ప్రారంభమైంది. ఆమె అక్టోబర్ 1న పదవీ విరమణ చేయనున్నారు. ఆమె పదవి కాలం ముగిసే వరకు అదే రోజు తిరిగి ఉద్యోగంలో చేరనున్నట్లు తెలిసింది.