LOADING...
Bihar Elections: పీకే మద్దతుదారుడి హత్య కేసులో జేడీయూ అభ్యర్థి అరెస్టు
పీకే మద్దతుదారుడి హత్య కేసులో జేడీయూ అభ్యర్థి అరెస్టు

Bihar Elections: పీకే మద్దతుదారుడి హత్య కేసులో జేడీయూ అభ్యర్థి అరెస్టు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2025
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) వేళ జన్‌సురాజ్‌ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ మద్దతుదారుడు దులార్‌చంద్‌ యాదవ్‌ హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. దులార్‌చంద్‌ హత్యలో నిందితుడిగా సీఎం నీతీశ్‌కుమార్‌ (Nitish Kumar) పార్టీ జేడీయూ (JDU) అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే అనంత్‌ సింగ్‌ (Anant Singh)ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంత్‌ సింగ్‌ పట్నా జిల్లాలోని మొకామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేడీయూ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దులార్‌ చంద్‌ హత్య అనంతరం పోలీసులు ఆయనపై నిఘా ఉంచి, ఆదివారం తెల్లవారుజామున బార్హ్‌లోని నివాసం వద్ద సోదాలు నిర్వహించారు.

Details

ఎన్నికల ప్రచారంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

అనంతరం అనంత్‌ సింగ్‌తో పాటు ఆయన అనుచరులు మణికాంత్‌ ఠాకూర్‌, రంజీత్‌ రామ్‌లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురినీ విచారణ నిమిత్తం పట్నాకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. మొకామా నియోజకవర్గంలో జన్‌సురాజ్‌ పార్టీ అభ్యర్థి పీయూష్‌ ప్రియదర్శి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా, రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. అదే సమయంలో పీయూష్‌ మామ, పార్టీ కార్యకర్త దులార్‌ చంద్‌పై కొందరు దుండగులు కాల్పులు జరపగా, ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.

Details

మరో ముగ్గురు అధికారులపై  క్రమశిక్షణా చర్యలు

పోస్టుమార్టం నివేదిక ప్రకారం బుల్లెట్‌ గాయం ఉన్నప్పటికీ, షాక్‌ కారణంగానే మరణం సంభవించినట్లు వెల్లడైంది. ఈ హత్య ఘటనతో ఆగ్రహానికి గురైన దులార్‌చంద్‌ మద్దతుదారులు ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవీ కారుపై రాళ్లు రువ్వారు. ఈ మొత్తం వ్యవహారంపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. అల్లర్ల నియంత్రణలో వైఫల్యం కారణంగా పట్నా రూరల్‌ ఎస్పీ విక్రమ్‌ సిహాగ్‌ను బదిలీ చేశారు. అదనంగా మరో ముగ్గురు అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.