Loading...
Srirangam Jeeyar: పోప్‌ను ఎన్నుకున్నట్లే జీయర్‌ను ఎంపిక చేయాలి.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు
పోప్‌ను ఎన్నుకున్నట్లే జీయర్‌ను ఎంపిక చేయాలి.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు

Srirangam Jeeyar: పోప్‌ను ఎన్నుకున్నట్లే జీయర్‌ను ఎంపిక చేయాలి.. మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 31, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీరంగంలోని ప్రసిద్ధ శ్రీ రంగనాథస్వామి ఆలయానికి చెందిన శ్రీరంగనారాయణ జీయర్ మఠం పీఠాధిపతి (జీయర్) ఎంపిక ప్రక్రియపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోప్‌ను ఎన్నుకునే తరహాలోనే తదుపరి జీయర్‌ను ఎంపిక చేయాలని సూచించింది. ఈ ఎంపిక బాధ్యత ఆలయ నిర్వాహకులైన స్థలత్తార్లదేనని స్పష్టం చేసింది. జీయర్ లేని సమయంలో స్థలత్తార్లు, భట్టార్‌లకు అధికారాలు అప్పగిస్తామని, జీయర్‌కు దక్కే గౌరవ మర్యాదలు కూడా వారికే లభిస్తాయని పేర్కొంది. ఈ మేరకు తిరుచ్చికి చెందిన ఎస్. వీరరాఘవన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు మధురై ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాలు

ఆరు నెలల్లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి

జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ పి. మురుగన్‌లతో కూడిన ధర్మాసనం.. ఈ ఆధ్యాత్మిక పీఠాన్ని అధిరోహించేందుకు అర్హత, అనుకూలత ఉన్న వ్యక్తులను ఆహ్వానించాలని స్థలత్తార్లను ఆదేశించింది.

జీయర్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు గరిష్టంగా ఆరు నెలల గడువు విధిస్తున్నట్లు న్యాయమూర్తులు స్పష్టం చేశారు.

ఈ బాధ్యతను స్థలత్తార్లు సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమైతే, 'పారేన్స్ ప్యాట్రియా' (Parens patriae)అధికార పరిధిని ఉపయోగించి జోక్యం చేసుకోవడానికి కోర్టు వెనుకాడబోదని హెచ్చరించారు.

కాగా 'పారేన్స్ ప్యాట్రియా' అనేది ఒక చట్టపరమైన అధికారం. తమను తాము సంరక్షించుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తులు లేదా సంస్థలకు సంరక్షకుడిగా వ్యవహరించే అధికారాన్ని ఇది ప్రభుత్వానికి, రాజ్యాంగ న్యాయస్థానాలకు కల్పిస్తుంది.

అవసరమైన సందర్భాల్లో వారి ప్రయోజనాలను కాపాడేందుకు ఈ అధికారాన్ని వినియోగించవచ్చు.

వివరాలు

2018 నుంచి ఖాళీగా జీయర్ పీఠం

శ్రీరంగం శ్రీరంగనారాయణ జీయర్ మఠానికి చెందిన 50వ జీయర్ 89 ఏళ్ల వయసులో 2018లో పరమపదించారని పిటిషనర్ వీరరాఘవన్ కోర్టుకు తెలిపారు.

అప్పటి నుంచి పీఠాధిపతి స్థానం ఖాళీగానే ఉందని, ఆయన తదుపరి వారసుడిని ఇప్పటివరకు ఎంపిక చేయలేదని వివరించారు.

జీయర్ బాధ్యతలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకే పరిమితం కావు. ఆలయ పరిపాలనలోనూ ఆయన భాగస్వామిగా ఉంటారు.

ఈ క్రమంలో ఆయనకు కొన్ని ప్రత్యేక అధికారాలు, విధులు ఉంటాయి. అందువల్ల ఖాళీగా ఉన్న పీఠాధిపతి స్థానాన్ని సంప్రదాయాల ప్రకారం భర్తీ చేయాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

మఠాధిపతి తన వారసుడిని నియమించకుండానే మరణిస్తే, సంప్రదాయాల ప్రకారం తదుపరి వారసుడిని ఎంపిక చేయాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు

దేవాదాయ శాఖ వారిని ప్రోత్సహించాలి

ఆలయ స్థలత్తార్లు, భట్టార్‌లు (వంశపారంపర్య అర్చకులు) ఏకగ్రీవంగా లేదా మెజారిటీ నిర్ణయం ద్వారా కొత్త జీయర్‌ను ఎన్నుకోవాలని తెలిపింది.

ఈ ప్రక్రియలో స్థలత్తార్లు సహకరించకపోతే, వారసుడిని ఎంపిక చేసేలా దేవాదాయ శాఖ వారిని ప్రోత్సహించాలని కోర్టు పేర్కొంది.

అయితే, దీనికి భిన్నంగా 2021లో దేవాదాయ శాఖ దరఖాస్తులను ఆహ్వానించిందని గుర్తుచేసింది.

అర్హులైన వ్యక్తుల నుంచి స్పందన వచ్చినప్పటికీ, ఆ తర్వాత ఎంపిక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ధర్మాసనం పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు

జీయర్‌ను ఆలయ ఈఓ నియమించలేరు

గతంలో 50వ జీయర్‌ను 1989లో ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) నియమించిన విషయాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది.

అయితే ప్రస్తుత ఎంపిక ప్రక్రియలో ఈఓ ద్వారా జీయర్‌ను నియమించేందుకు కోర్టు నిరాకరించింది.

ఒక పీఠాధిపతిని ఎంపిక చేయడం పూర్తిగా ఆధ్యాత్మికపరమైన వ్యవహారమని, దానిని సాధారణ లౌకిక లేదా పరిపాలనాపరమైన చర్యగా పరిగణించలేమని స్పష్టం చేసింది. మఠాధిపతిని ఆలయ ఉద్యోగిగా భావించలేమని పేర్కొంది.

అందువల్ల స్థలత్తార్లు ఎంపిక చేసిన అభ్యర్థికి దేవాదాయ శాఖ అధికారికంగా ఆమోదం తెలపవచ్చని వెల్లడించింది.

వివరాలు

పోప్ ఎన్నిక తరహాలో జీయర్ ఎంపిక

ఈ సందర్భంగా క్రైస్తవ మతంలో పోప్‌ను ఎన్నుకునే ప్రక్రియను ధర్మాసనం ఉదాహరణగా తీసుకుంది.

పోప్ ఎన్నిక సమయంలో కార్డినల్స్ అందరినీ సిస్టీన్ చాపెల్‌లో ఉంచుతారని, ఎన్నిక ప్రక్రియ పూర్తయి గొట్టం నుంచి తెల్లటి పొగ వెలువడిన తర్వాతే తలుపులు తెరుస్తారని గుర్తుచేసింది.

అదే తరహాలో స్థలత్తార్లు అందరూ మఠంలో సమావేశమై తదుపరి జీయర్‌ను ఎంపిక చేసిన తర్వాతే బయటకు రావాలని న్యాయస్థానం సూచించింది.

ఈ విధంగా సంప్రదాయబద్ధంగా, సమిష్టి నిర్ణయంతో పీఠాధిపతిని ఎంపిక చేయాల్సిన బాధ్యత వారిపై ఉందని స్పష్టం చేసింది.

స్థలత్తార్లు తమపై ఉన్న బాధ్యతను నిర్వర్తించకపోతే, తదుపరి జీయర్ ఎంపిక విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోవడానికి ఏమాత్రం వెనుకాడబోదని మద్రాసు హైకోర్టు తేల్చిచెప్పింది.

ADVERTISEMENT