జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం..హేమంత్ సోరెన్ ఎక్కడ? సీఎంగా ఆయన సతీమణి?
జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గత మూడు రోజులుగా కనిపించకపోవడంతో పరిస్థితులు గందరగోళంగా మారాయి. ఒక వైపు సీఎం హేమంత్ సోరెన్ అందుబాటులో లేకపోవడం, మరోవైపు జార్ఖండ్‌లోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేతృత్వంలోని అధికార కూటమి (మహాగట్‌బంధన్) ఎమ్మెల్యేలందరికీ రాష్ట్ర రాజధాని రాంచీని విడిచిపెట్టవద్దని ఆదేశాలను జారీ చేశారు. ఈ పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ అస్థిరతకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి చర్చించడానికి మంగళవారం జరిగే సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని మహాకూటమి నేతలకు ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగొచ్చనే ప్రచారం జరుగుతోంది. భూ కుంభకోణం కేసులో సీఎం సోరెన్ ఈడీ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
కల్పనా సోరెన్ సీఎం అవుతారా?
తాజా పరిణామాలపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడారు. తమకు అందిన సమాచారం మేరకు తన సతీమణి కల్పనా సోరెన్‌కు హేమంత్ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తారని అన్నారు. ఈడీ విచారణకు భయపడి.. హేమంత్ సీఎం పదవిని భార్యకు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు నిషికాంత్ దూబే చెప్పారు. అందుకోసమే మంగళవారం అధికార కూటమి ఎమ్మెల్యేలతో తన నివాసంలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జార్ఖండ్‌లోని అధికార మహాకూటమిలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ఉన్నాయి. ఈ మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికే రాంచీలోని సీఎం సోరెన్ నివాసానికి చేరుకున్నారు. అయితే ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తికరంగా మారింది.
జనవరి 27 నుంచి కనిపించని సోరెన్
సోరెన్ జనవరి 27న రాంచీ నుంచి దిల్లీకి వచ్చారు. ఆయన్ను విచారించేందుకు సోమవారం ఈడీ అధికారులు దిల్లీలోని సోరెన్ నివాసానికి వెళ్లారు. కానీ సోరెన్ తన నివాసంలో లేరు. దీంతో ఈడీ అధికారులు సీఎం సోరెన్‌కు చెందిన బీఎండబ్ల్యూ కారుతో పాటు ఒక బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. సీఎం సోరెన్ ఇప్పటికీ కూడా ఎక్కడ ఉన్నారన్నది తెలియరాలేదు. కానీ రాంచీ నుంచి వెళ్లిన ఒక ప్రైవేటు విమానం దిల్లీలోని ఎయిర్‌పోర్టులో పార్క్ చేసినట్లు తమ తెలిసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే, జనవరి 31న మధ్యాహ్నం 1గంటలకు ఈడీ విచారణకు హాజరవుతానని ఈడీకి మెయిల్ ద్వారా సమాచారం పంపించారు.
రెండు కార్లు, రూ.36 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న ఈడీ
దిల్లీలోని హేమంత్ సోరెన్ అధికారిక నివాసంలో సోమవారం జరిగిన సోదాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రెండు బీఎండబ్ల్యూలు, కొన్ని నేరారోపణ పత్రాలు, రూ.36 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు 13 గంటల పాటు సోరెన్ కోసం ఈడీ అధికారులు వేచి చూశారు అయినా ఆయన రాలేదు. ఈ క్రమంలో హేమంత్ సోరెన్ కోసం దిల్లీ విమానాశ్రయంలో ఈడీ బృందాలు నిఘా ఉంచినట్లు సమాచారం. ఇదే సమయంలో రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలపై గవర్నర్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.