Jharkhand : రీల్స్ పిచ్చితో 100 అడుగుల ఎత్తు నుంచి నీళ్లలోకి దూకి..యువకుడు మృతి
జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. రీల్స్ చేసేందుకు ప్రయత్నిస్తూ.. ఓ యువకుడు 100 అడుగుల ఎత్తు నుంచి దూకి లోతైన నీటిలో మునిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీమ్‌తో పాటు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసులు మంగళవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృత దేహం వెలికి తీయడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జిల్లాలోని జిరావబరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కరమ్ పర్వతం సమీపంలో రాతి క్వారీ ఉంది. ఇక్కడ నీటి చెరువు ఉంది.
రీల్ తీస్తూ యువకుడు మృతి
తౌసిఫ్ అనే యువకుడు తన స్నేహితులతో స్నానం చేసేందుకు ఇక్కడికి వచ్చాడు. ఈ క్రమంలో దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి లోతైన నీటిలో దూకి నీటిలో మునిగిపోయాడు. ఈ ఘటనపై సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అనీష్ పాండేకు సమాచారం అందించారు. స్థానిక డైవర్లు, తీవ్రంగా శ్రమించి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. విచారణలో యువకుడు తన స్నేహితులతో కలిసి రీల్స్ తీస్తున్న సమయంలో తౌసిఫ్100 అడుగుల ఎత్తు నుంచి దూకాడు. దింతో నీటిలో మునిగి చనిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చెరువులో మునిగిపోవడంతో ఈ ప్రమాదం
ఈ ఘటనపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ కుష్వాహ మాట్లాడుతూ.. సోమవారం సాయంత్రం తౌసిఫ్ అనే 18 ఏళ్ల యువకుడు కొంతమంది స్నేహితులతో కలిసి మూసి ఉన్న రాతి గనిలో స్నానం చేసేందుకు వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందిందని తెలిపారు. ఈ క్రమంలో కొందరు స్నేహితులు అతడి వీడియోలు కూడా తీస్తున్నారు. 100 అడుగుల లోతు నీటిలోకి దూకిన యువకుడు తనను తాను అదుపు చేసుకోలేక లోతు నీటిలో మునిగి మృతి చెందాడని తెలిపారు.