Loading...
Ayodhya donation: అయోధ్య విరాళాల చోరీపై రిపోర్టింగ్‌.. జర్నలిస్టు అభిషేక్‌పై ఎస్సీ-ఎస్టీ కేసు
అయోధ్య విరాళాల చోరీపై రిపోర్టింగ్‌.. జర్నలిస్టు అభిషేక్‌పై ఎస్సీ-ఎస్టీ కేసు

Ayodhya donation: అయోధ్య విరాళాల చోరీపై రిపోర్టింగ్‌.. జర్నలిస్టు అభిషేక్‌పై ఎస్సీ-ఎస్టీ కేసు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
01:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

అయోధ్య రామమందిరంలోని విరాళాలు చోరీకి గురైనట్లు జర్నలిస్టు అభిషేక్‌ ఉపాధ్యాయ చేసిన రిపోర్టింగ్‌ అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే తాజాగా ఆయనపై రోడ్‌రేజ్‌ కేసు నమోదైంది. దీనిపై అభిషేక్‌ ఉపాధ్యాయ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేయాలని ఆయన తరఫు న్యాయవాది అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

వివరాలు 

విరాళాల చోరీ రిపోర్టింగ్‌ వల్లే కేసులంటూ ఆరోపణ

అయోధ్య రామమందిరం విరాళాల చోరీ వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకురావడం వల్లే ఘజియాబాద్‌ పోలీసులు తనపై రోడ్‌రేజ్‌ కేసు నమోదు చేశారని అభిషేక్‌ తన పిటిషన్‌లో ఆరోపించారు.

అంతేకాకుండా ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా తనపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్‌ వి. మోహన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించనుంది.

వివరాలు 

వరుస ఎఫ్‌ఐఆర్‌లు.. ఇంటిపై పోలీసుల సోదాలు

అభిషేక్‌పై ఇప్పటికే అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని ఆయన తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు.

కఠినమైన ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదైందని తెలిపారు.

ఈ నెల 20న పోలీసులు అభిషేక్‌ ఇంటిపై సోదాలు నిర్వహించారని, సోమవారం కూడా సాయంత్రం 5 గంటలకు పోలీసులు ఆయన ఇంటికి వచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేస్తున్నామని, వీలైనంత త్వరగా.. అంటే సోమవారం లేదా మంగళవారమే విచారణ చేపట్టాలని అభిషేక్‌ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు.

ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి.. పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

అనేక అంశాలపై ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టింగ్

రామమందిరంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన అవినీతి వ్యవహారాలతో పాటు పలు పరిశోధనాత్మక అంశాలపై జర్నలిస్టు అభిషేక్‌ ఉపాధ్యాయ రిపోర్టింగ్‌ చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సన్నిహితంగా ఉండే ఓ ఐఏఎస్‌ అధికారికి సంబంధించిన అంశంపై కూడా ఆయన సంచలనాత్మక కథనం అందించినట్లు తెలుస్తోంది.

అలాగే బదోయి ప్రాంతంలో 2023లో రూ.20 కోట్ల విలువైన వ్యవసాయ భూమికి సంబంధించిన ఓ కేసుపై కూడా అభిషేక్‌ వివాదాస్పద కథనం ప్రచురించినట్లు సమాచారం.

ADVERTISEMENT

వివరాలు 

ఆగస్టు 18న రోడ్‌రేజ్‌ ఫిర్యాదు

ఆగస్టు 18న ఓ ద్విచక్ర వాహనదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జర్నలిస్టు అభిషేక్‌ తన వాహనంతో వెనుక నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు ఫిర్యాదులో ఆరోపించాడు.

అనంతరం తనను బెదిరించడంతో పాటు దూషించారని కూడా పేర్కొన్నాడు. దీంతో భారతీయ న్యాయ సంహితతో పాటు ఎస్సీ-ఎస్టీ చట్టం కింద అభిషేక్‌పై కేసు నమోదు చేశారు.

వివరాలు 

ఆరోపణలు నిరాధారమన్న అభిషేక్

తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని అభిషేక్‌ ఉపాధ్యాయ స్పష్టం చేశారు.

తన కుమార్తెను పాఠశాల నుంచి తీసుకువస్తున్న సమయంలో ఓ వ్యక్తి తన కారుకు అడ్డంగా వచ్చి గొడవ సృష్టించేందుకు ప్రయత్నించాడని ఆయన తెలిపారు.

ఆ సమయంలో తనతో కుమార్తె కూడా ఉండటంతో తాను ఎలాంటి గొడవకు దిగలేదని చెప్పారు.

తనపై కక్షతోనే రాష్ట్ర ప్రభుత్వం రోడ్‌రేజ్‌ కేసు నమోదు చేయించిందని అభిషేక్‌ ఆరోపించారు.

ఘటన జరిగిన ప్రాంతంలోని దుకాణాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాలని తోటి జర్నలిస్టులను కోరినట్లు తెలిపారు.

అయితే పోలీసులు అంతకుముందే ఆ సీసీటీవీ వీడియోలను తొలగించారని ఆయన ఆరోపించారు.

వివరాలు 

వాహన యజమాని ఫిర్యాదు చేయలేదని పిటిషన్‌లో వెల్లడి

తనపై కేసు నమోదైన విధానంపైనా అభిషేక్‌ పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

తన వాహనం ఢీకొట్టిందని చెప్పిన ద్విచక్ర వాహన యజమాని స్వయంగా ఫిర్యాదు చేయలేదని, మరో వ్యక్తి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీంతో తనపై నమోదైన కేసులు, పోలీసుల చర్యలను సుప్రీంకోర్టు పరిశీలించాలని ఆయన కోరారు.

ADVERTISEMENT