LOADING...
#NewsBytesExplainer: కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల భవిష్యత్తును తేల్చే జూబ్లీహిల్స్ బైపోల్.. ఎవరిని అదృష్టం వరించునో!
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల భవిష్యత్తును తేల్చే జూబ్లీహిల్స్ బైపోల్.. ఎవరిని అదృష్టం వరించునో!

#NewsBytesExplainer: కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల భవిష్యత్తును తేల్చే జూబ్లీహిల్స్ బైపోల్.. ఎవరిని అదృష్టం వరించునో!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 15, 2025
03:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రధాన రాజకీయ పార్టీలైన బీఆర్ఎస్‌, కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మక పోరుగా మారింది. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన తర్వాత నుంచే ప్రచారం ఊపందుకుంది. బీజేపీ ఇంకా అభ్యర్థిని ఖరారు చేయకపోయినా, కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ ఎన్నిక ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఒకే సీటు అయినప్పటికీ దీని ఫలితం రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకుల అభిప్రాయం. తాజాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ ఆధిపత్యాన్ని చాటుకున్నందున, ఈసారి కూడా అదే గెలుపు జోష్ కొనసాగుతుందా అన్న ప్రశ్న నెలకొంది.

Details

 బీఆర్ఎస్‌కు కీలక పరీక్ష

ఈ ఉప ఎన్నిక మాగంటి గోపినాథ్ మరణంతో తప్పనిసరైంది. ఆయన భార్య సునీతకు బీఆర్‌ఎస్ ముందుగానే టికెట్ ఇచ్చింది. ఆమె నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్లను లాభంగా మల్చుకోలేకపోయిన అనుభవం ఉన్నందున, ఈసారి పార్టీ ప్రచార పద్ధతిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తోంది. అభ్యర్థి సునీతకు ఎక్కువగా సానుభూతి, సేవా అంశాలపై దృష్టి పెట్టాలని, భర్త చేసిన సేవలను గుర్తుచేస్తూ ప్రచారం చేయాలని సూచిస్తున్నారు. ప్రత్యర్థులపై దూకుడు విమర్శలకు దూరంగా ఉండాలని చూస్తోంది.

Details

మహిళ ఓటర్లపై దృష్టి

ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం సాగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆమె కుమార్తెలు కూడా బస్తీల్లో పర్యటిస్తూ మద్దతు సంపాదించేందుకు కృషి చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కేటీఆర్ స్వయంగా ప్రచార బాధ్యతలు తీసుకుని కాలనీలు, డివిజన్ స్థాయి సమావేశాల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు లోపం, మోసపు రాజకీయాలు వంటి అంశాలను ఎత్తి చూపుతూ ఆగ్రహ ప్రసంగాలు చేస్తున్నారు. అయితే ఈ వ్యూహం ఎంతవరకు పనికివస్తుందో ఎన్నికల ఫలితాల తర్వాతే తేలేది.

Details

కేటీఆర్ నాయకత్వానికి సవాల్

కాంగ్రెస్ పాలనలో అమలు కాని హామీలను గుర్తుచేస్తూ బీఆర్ఎస్ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. హైడ్రా కూల్చివేతలు, బుల్డోజర్ రాజకీయాలు, కవితపై విచారణ వంటి అంశాలు కూడా ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు భారమవుతున్నాయి. కేటీఆర్ నాయకత్వంపై నమ్మకం నిలబడాలంటే విజయమే మార్గమని గులాబీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది.

Details

బీజేపీకి సవాల్ గా ఎన్నిక  

ఇక బీజేపీ విషయంలో అభ్యర్థి ఎంపికలో గందరగోళం కొనసాగుతోంది. సరైన అభ్యర్థి కోసం అన్వేషణ జరుగుతోందా? లేక ఉన్న వారిలోని ఎవరికైనా అవకాశం ఇస్తారా అన్నది ఇంకా స్పష్టతలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిధిలోనే ఈ నియోజకవర్గం ఉండటం కారణంగా ఆయనకు ఇది సవాల్‌గా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అంతర్గత వ్యతిరేకత పెరిగినట్టు సూచనలున్నాయి. మరోవైపు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ పరిస్థితిని బహిర్గతం చేశాయని విశ్లేషకులు అంటున్నారు.

Details

రేవంత్ రెడ్డిపై భారీ ఒత్తిడి

ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి ఏడాదిన్నర గడిచిన రేవంత్ రెడ్డి పాలనపై ఈ ఉప ఎన్నిక ఒక పరీక్షగా మారింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, సబ్సిడీ గ్యాస్, ఉచిత విద్యుత్ వంటి హామీల అమలు ప్రశ్నార్థకమని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్ర రహదారుల పరిస్థితి, మూసీ పునరుజ్జీవన నిర్లక్ష్యం, ఆక్రమణ పేరుతో ఇళ్లు కూల్చివేత వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముంది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ నాయకత్వం కూడా ఈ ఎన్నిక ఫలితంపై ఆధారపడి పరీక్షించనుంది.

Details

తుది సమీకరణం 

ప్రస్తుతం మూడు పార్టీలూ బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోరు బీఆర్ఎస్‌, కాంగ్రెస్ మధ్యే ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఫలితాలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముంది. ఫలితాల రోజు ముగ్గురు పార్టీల జాతకాలు తేలిపోవడం ఖాయం.