రిటైర్డ్ జడ్జిల ప్రకటనలను వారి వ్యక్తిగత అభిప్రాయాలుగానే చూడాలి: సీజేఐ
రిటైర్డ్ జడ్జిల ప్రకటనల విషయంలో భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులు పదవీ విరమణ చేసిన తర్వాత వారు చెప్పేది కేవలం వారి సొంత అభిప్రాయం మాత్రమే అవుతుందని, దాన్ని పాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేశవానంద భారతి కేసు తీర్పులో సుప్రీంకోర్టు చెప్పిన రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ సూత్రం గురించి మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ మాట్లాడిన నేపథ్యంలో దానికి సమాధానంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. 1973 నాటి కేశవానంద భారతిలో తీర్పులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ సూత్రాన్ని పేర్కొంది. రాజ్యాంగంలోని ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమాఖ్యవాదం, చట్టబద్ధమైన పాలన వంటి కొన్ని ప్రాథమిక లక్షణాలను పార్లమెంటు సవరించలేదని స్పష్టం చేసింది.
ఇంతకీ మాజీ సీజేఐ రంజన్ గొగోయ్ ఏమన్నారంటే?
రాజ్యసభలో సోమవారం దిల్లీ సర్వీసెస్ బిల్లుపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన చర్చలో జస్టిస్ రంజన్ గొగోయ్ మాట్లాడారు. కేశవానంద భారతి కేసుపై మాజీ సొలిసిటర్ జనరల్ టీఆర్ అందరుజిన్ రాసిన పుస్తకాన్ని చదివిన తర్వాత తాను ఓ నిర్ధిష్టమైన అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు. రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ సూత్రం చాలా వివాదాస్పదమైన న్యాయశాస్త్ర ప్రాతిపదికను కలిగి ఉందని, దీనిపై చర్చకు అవకాశం ఉందని తాను నమ్ముతున్నట్లు జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రకటించారు. ఇంతకు మించి తాను ఏమీ చెప్పలేనన్నారు.
ఆర్టికల్ 370 పిటిషన్ విచారణ సందర్భంలో సీజేఐ వ్యాఖ్యలు
సుప్రీంకోర్టులో జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు మహ్మద్ అక్బర్ లోన్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణ సూత్రం అంశంపై ప్రస్తావన వచ్చిన సందర్భంగా జస్టిస్ రంజన్ గొగోయ్ రాజ్యసభలో చేసిన ప్రకటనను కపిల్ సిబాల్ గుర్తు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తాము పదవి నుంచి దిగిపోయాక ఏం మాట్లాడినా, అది వ్యక్తిగత అభిప్రాయమే అవుతుందని స్పష్టం చేశారు. దానికి రాజ్యాంగ బద్ధత ఉండదన్నారు.