Loading...
Justice for Netaji : నేతాజీ ఆశయాల ప్రచారం కోసం 13 వేల కిలోమీటర్ల బైక్‌ యాత్ర
నేతాజీ ఆశయాల ప్రచారం కోసం 13 వేల కిలోమీటర్ల బైక్‌ యాత్ర

Justice for Netaji : నేతాజీ ఆశయాల ప్రచారం కోసం 13 వేల కిలోమీటర్ల బైక్‌ యాత్ర

వ్రాసిన వారు Moogati Shabari
Jul 05, 2026
10:44 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ స్వాతంత్య్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు తగిన గౌరవం కల్పించాలని కోరుతూ వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం కీర్తినగర్‌ కాలనీకి చెందిన ఆడెపు కిశోర్‌కుమార్‌ (44) దేశవ్యాప్తంగా సుమారు 13 వేల కిలోమీటర్ల మోటార్‌సైకిల్‌ యాత్ర నిర్వహించారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను స్థాపించి భారత స్వేచ్ఛ కోసం పోరాడిన నేతాజీ మరణంపై కేంద్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయడంతో పాటు, ఆయన అస్థికలను కుటుంబ సభ్యులకు అప్పగించి, ఆయన దేశానికి చేసిన సేవలకు తగిన గుర్తింపు ఇవ్వాలని ఆయన ఈ యాత్ర ద్వారా విజ్ఞప్తి చేశారు.

వివరాలు

20 రాష్ట్రాల్లో పర్యటన పూర్తి..

ఎంబీఏ విద్యను అభ్యసించిన కిశోర్‌కుమార్‌ ప్రస్తుతం అవుట్‌డోర్‌ మీడియా మార్కెటింగ్‌ రంగంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.

నేతాజీ జీవిత చరిత్రను అధ్యయనం చేసిన అనంతరం ఆయన దేశభక్తి, త్యాగం, ఆశయాలకు ప్రేరణ పొందిన కిశోర్‌కుమార్‌ ఈ ఏడాది మే 2న వరంగల్‌ నుంచి తన బైక్‌ యాత్రను ప్రారంభించారు.

తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌తో పాటు మొత్తం 20 రాష్ట్రాల్లో ఆయన పర్యటించారు.

యాత్ర సందర్భంగా వివిధ పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులకు నేతాజీ జీవిత విశేషాలు, స్వాతంత్య్ర పోరాటంలో ఆయన పాత్ర, దేశభక్తి భావన గురించి అవగాహన కల్పించారు.

వివరాలు

కేంద్రానికి విన్నపం..

ఈ యాత్రను సుమారు రూ.80 వేల స్వంత నిధులతో చేపట్టిన కిశోర్‌కుమార్‌ విజయవంతంగా పూర్తిచేసుకుని శుక్రవారం రాత్రి గీసుకొండ మండలం కీర్తినగర్‌ కాలనీకి చేరుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మరణానికి సంబంధించిన వాస్తవాలు ఇప్పటికీ స్పష్టంగా వెలుగులోకి రాలేదని పేర్కొన్నారు.

ఈ మిస్టరీకి తెరదించి, అసలు నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

ADVERTISEMENT