Kaleshwaram Project: కాళేశ్వరం కేసు.. ఇంజినీర్లపై రేపటి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగింపు
కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణలో కీలక మలుపు.. రేపటి నుంచి మళ్లీ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం కానుంది. ఇంజినీర్లు, విశ్రాంత ఇంజినీర్లు, ఉన్నతాధికారులను జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారించనున్నారు. గతంలో ఇప్పటికే విచారణకు హాజరైన వారిని కూడా మరోసారి పిలిపించనున్నారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ విచారణ కొనసాగుతుందని సమాచారం. మంగళవారం నీటిపారుదలశాఖ అధికారులతో జస్టిస్ పీసీ ఘోష్ సమావేశమయ్యారు. విజిలెన్స్ డీజీకి వీలైనంత త్వరగా తుది నివేదిక అందించాలని ఆయన ఆదేశించారు.
మరిన్ని అంశాలపై విచారణ
ప్రాజెక్ట్ ఆనకట్టలు నిర్మించిన సంస్థల ప్రతినిధులను కూడా ఈ విచారణలో పిలిపించనున్నారు. నిర్మాణ పనుల రికార్డులు, సంస్థల లావాదేవీల వివరాలను కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించనుంది. అఫిడవిట్ దాఖలు చేసిన వి. ప్రకాశ్ కూడా విచారణకు హాజరు కానున్నారు. ఎన్డీఎస్‌ఏ, కాగ్ నివేదికలను ఆధారంగా చేసుకొని మరిన్ని అంశాలపై విచారణ జరగనుంది.