
Kaleshwaram Commission: కాళేశ్వరం బ్యారేజీలపై ఘోష్ కమిషన్ నివేదిక సిద్ధం.. సీల్డ్ కవర్‌లో త్వరలో ప్రభుత్వానికి సమర్పణ
ఈ వార్తాకథనం ఏంటి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై విచారణకు న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ సీల్డ్ కవర్ నివేదికను త్వరలో సమర్పించనుందని సమాచారం. గత ఏడాది జూన్ నుంచి ప్రత్యక్ష విచారణను ప్రారంభించిన ఘోష్ కమిషన్.. ఈ దిశగా వందలాది అఫిడవిట్లు, బహిరంగ విచారణలు, ఎన్డీఎస్‌ఏ, విజిలెన్స్, కాగ్ నివేదికలు, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అప్పటి ప్రభుత్వం ఆమోదించిన మంత్రిమండలి సమావేశాల నోట్స్ (మినిట్స్), అలాగే ప్రభుత్వమే సమర్పించిన వేలాది పేజీల సమాచారాన్ని సమగ్రంగా అధ్యయనం చేసింది. ఈ ప్రక్రియలో ఎన్నో ముఖ్యమైన ఆధారాలను సేకరించినట్టు సమాచారం. బ్యారేజీల నిర్మాణాల్లో చోటుచేసుకున్న లోపాలు,వాటికి సంబంధించి లభించిన ఆధారాలతో కమిషన్ ఒక పెద్ద నివేదికను సిద్ధం చేస్తోందని తెలుస్తోంది.
వివరాలు
ప్రజాప్రతినిధుల అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ
కమిషన్‌కు ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుండగా, నివేదిక సిద్ధమవగానే కమిషన్ కార్యదర్శి దానిని నీటిపారుదల శాఖకు అందజేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో,ఆగస్టు 1 లేదా 2 తేదీలలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నివేదికను స్వీకరించి, ప్రభుత్వానికి సమర్పించే అవకాశముందని తెలుస్తోంది. ఈ విచారణ ప్రక్రియలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్,మాజీ మంత్రి,ప్రస్తుత ఎమ్మెల్యే హరీశ్‌రావు, అలాగే మాజీ మంత్రి,ప్రస్తుత ఎంపీ ఈటల రాజేందర్‌లు హాజరైన అనంతరం కమిషన్ బహిరంగ విచారణలను పూర్తిచేసిన విషయం తెలిసిందే. ఇంకా,ప్రజాప్రతినిధుల అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న మరో కేసును కూడా కమిషన్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, ఆ కేసు ప్రభావం ఈ కమిషన్ నివేదికపై పడే అవకాశం లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.