Loading...
Kanchipuram: కాంచీపురం అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో ఘర్షణ.. ఇద్దరు మృతి, 20 మందికి గాయాలు
కాంచీపురం అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో ఘర్షణ.. ఇద్దరు మృతి, 20 మందికి గాయాలు

Kanchipuram: కాంచీపురం అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో ఘర్షణ.. ఇద్దరు మృతి, 20 మందికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో అమ్మవారి ఆలయ ఉత్సవాలు తీవ్ర విషాదానికి దారితీశాయి. పడునెల్లి పరిధిలోని స్థానిక అమ్మన్ ఆలయంలో ఉత్సవాలు జరుగుతున్న సమయంలో రెండు వర్గాల యువకుల మధ్య మొదలైన చిన్నపాటి వివాదం కాస్తా పెద్ద ఘర్షణగా మారింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది వరకు గాయపడినట్లు సమాచారం. మైకుల్లో పాటల విషయంలో వివాదం ఆలయ ఉత్సవాల సందర్భంగా మైకుల్లో పాటలు పెట్టే విషయంపై రెండు వర్గాల యువకుల మధ్య మొదట వాగ్వాదం జరిగింది. తొలుత చిన్నపాటి వివాదంగానే ఉన్న ఈ గొడవ క్షణాల్లో తీవ్ర రూపం దాల్చింది. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరగడంతో పరిస్థితి అదుపు తప్పింది. .

వివరాలు 

కర్రలు, మారణాయుధాలతో దాడులు

వివాదం తీవ్ర ఘర్షణగా మారడంతో ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి.

కర్రలు, మారణాయుధాలు చేతబట్టి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఆలయ ఉత్సవ ప్రాంగణం ఒక్కసారిగా రణరంగంగా మారింది.

ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

ఘర్షణకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.

పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రుల్లో చేర్పించారు.

వివరాలు 

మృతుల బంధువుల ఆందోళన

ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతుల బంధువులు, స్థానికులు రహదారిపై బైఠాయించారు.

దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గ్రామంలో మరోసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు.

ఘర్షణకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఘటనకు దారితీసిన పరిస్థితులు, దాడిలో పాల్గొన్న వ్యక్తుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ADVERTISEMENT