
#NewsBytesExplainer: కర్ణాటకలో ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంపు నిర్ణయం.. ఆందోళనలో తెలుగు రాష్ట్రాల రైతాంగం
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని అత్యంత కీలకమైన భారీ ప్రాజెక్ట్ ఆలమట్టి డ్యామ్ ఎత్తును పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రైతులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నీటిపారుదల నిపుణుల హెచ్చరిక ప్రకారం,ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెరిగితే,దిగువన ఉన్న తెలంగాణ రాష్ట్రం గణనీయ నష్టాన్ని ఎదుర్కొనే అవకాశముంది. ఈ అంశంపై తెలంగాణ తన వాదనను కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ వద్ద సమర్పించనుంది. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి సోమవారం ఢిల్లీలో జల్ శక్తి శాఖ మంత్రిని కలిసి ఈ సమస్యను రిపోర్ట్ చేయనున్నారు. ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెరగడం వల్ల తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు, .
వివరాలు
ఆలమట్టి ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం
కర్ణాటక మంత్రివర్గం,ఆలమట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుండి 524.256 మీటర్లకు పెంచాలని నిర్ణయించింది. దీని ద్వారా అదనంగా 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు,తద్వారా కర్ణాటకలో 5.94 లక్షల హెక్టార్ల భూభాగానికి సాగునీటి అందుబాటును పెంచగలుగుతారు. ప్రస్తుతం డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 123.08 టీఎంసీలు. సముద్రంలో వృథా అవుతున్న నీటిని ఉపయోగించేందుకు డ్యామ్ ఎత్తు పెంచడం అవసరం అని కర్ణాటక ప్రభుత్వం వివరిస్తోంది. అయితే,దీని ఫలితంగా దిగువ రాష్ట్రాలు..తెలంగాణ,ఆంధ్రప్రదేశ్.. ప్రతికూల ప్రభావం ఎదుర్కోవచ్చు. ఎత్తు పెంపుకు 1,33,867 ఎకరాల భూమి అవసరమవుతుంది.ఇందులో 75,563 ఎకరాలు ముంపునకు, 51,837 ఎకరాలు కాలువల కోసం, 6,469 ఎకరాలు పునరావాసం కోసం, అలాగే 20 గ్రామాలపై బాగల్ కోట్‌లోని 11 వార్డులను తరలించాల్సి ఉంటుంది.
వివరాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగింది?
వ్యవసాయ భూమికి ఎకరానికి రూ. 40 లక్షలు, సాధారణ భూమికి ఎకరానికి రూ. 30 లక్షలు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంపును తీవ్రంగా వ్యతిరేకించింది, రాజకీయ, న్యాయ పోరాటాలు చేపట్టింది. సుప్రీంకోర్టులో కేసులు దాఖలు చేసింది. ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంపు విషయమై చర్చ 1996లో ప్రారంభమైంది.అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. డ్యామ్ ఎత్తు పెరిగితే, 123 టీఎంసీల నిల్వకు అదనంగా 100 టీఎంసీలు కర్ణాటకకు నిల్వ అవుతుంది. ఆలమట్టి, నారాయణపుర డ్యామ్‌లు నిండినప్పుడు మాత్రమే దిగువకు నీటిని విడుదల చేస్తున్నాయి. ఎత్తు పెంపు జరిగితే, ఈ అదనపు 100 టీఎంసీలు కూడా దిగువకు చేరకుండా ఉంటాయి.
వివరాలు
ఆలమట్టి ఎత్తు పెంపును నిలిపివేయాలని తీర్మానం
కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రతి ఐదేళ్లలో నాలుగు ఏళ్లకు ఒకసారి సరైన వరదలు వచ్చే పరిస్థితులు లేవు. కర్ణాటక రాష్ట్రం కృష్ణా నదీ వాటాను అధిగమించి ఉపయోగించుకోవచ్చు. 2000 నాటికి అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి కర్ణాటక ప్రభుత్వం కృష్ణ భాగ్య జల నిగమ్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ అప్రమత్తమైంది. 1996లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, కేంద్ర మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఈ విషయం వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆలమట్టి ఎత్తు పెంపును నిలిపివేయాలని తీర్మానం చేసింది. 1996 జనవరిలో, 1,170 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తికి కేంద్ర జలవిద్యుత్ సంస్థ ఇచ్చిన అనుమతికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
వివరాలు
యునైటెడ్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
ఆగస్టులో కృష్ణా పరివాహక రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో యునైటెడ్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ 1997 జనవరిలో నివేదిక సమర్పించి, "+519.6 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో ఆలమట్టి డ్యామ్ 123 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు సరిపోతుంది. ఇది నారాయణపుర వద్ద 37.8 టీఎంసీల నిల్వతో మరియు ఎగువ కృష్ణ ప్రాజెక్ట్ అవసరాలను తీర్చడానికి చక్కగా సరిపోతుంది" అని సూచించింది. అప్పట్లో సుప్రీంకోర్టు డ్యామ్ ఎత్తును 519.6 మీటర్లకే పరిమితం చేసింది.
వివరాలు
మరోసారి తెరపైకి ఆలమట్టి ఎత్తు పెంపు అంశం
కర్ణాటక ప్రభుత్వం డ్యామ్ ఎత్తు పెంచాలని నిర్ణయించడంతో తెలంగాణ లో తీవ్ర ఆందోళన చెందుతోంది. మహారాష్ట్ర కూడా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది.ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెరగడం వల్ల తెలంగాణకు వచ్చే నీటి పరిమాణం తగ్గిపోతుంది. ఇప్పటికే కృష్ణా నదీ ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కృష్ణా పరివాహక ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని తెలంగాణ నీటిపారుదల నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలమూరు,రంగారెడ్డి,ఎస్ఎల్బీసీ, ఇతర ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉన్నాయి. కృష్ణా జలాల పునర్వ్యవహారం కోసం ట్రిబ్యునల్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఖరీఫ్ సీజన్‌లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆగస్టు మొదటి వారంలో నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టులు, కృష్ణా నదిలో వరదలు తగ్గడం, ఈ పరిస్థితికి కారణం.
వివరాలు
కేంద్రం ముందు తమ వాదనలను ఉంచనున్న తెలంగాణ
ఇప్పుడు ఆలమట్టి ఎత్తు పెంచితే పరిస్థితి తెలంగాణకు కృష్ణా వరద జలాలు రావడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం తన వాదనలను కేంద్రం ముందు ఉంచనుంది. అలాగే, రాజకీయ విపక్షాలు ప్రభుత్వంపై దాడికి ఈ అంశాన్ని సాధనంగా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.