Karnataka: కర్ణాటకలో దారుణం.. భార్యను ఉరివేసి అత్తామామలకు వీడియో కాల్ చేసిన భర్త
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఓ వ్యక్తి తన 23 ఏళ్ల భార్యను దారుణంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె ప్రాణాల కోసం పోరాడుతున్న దృశ్యాలను వీడియోగా చిత్రీకరించి, అత్తామామలకు వీడియో కాల్ ద్వారా చూపించాడు. అనంతరం అదే వీడియోను బంధువులు, స్నేహితులకు పంపడం తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం, మృతురాలు భాగ్యశ్రీ జిగళూర్ (23), నిందితుడు ఆమె భర్త ప్రవీణ్ జిగళూర్ (28). బాగల్‌కోట్ జిల్లా గలగలి గ్రామంలోని వారి ఇంట్లో ఈ ఘటన జరిగింది. దంపతుల మధ్య జరిగిన గొడవలో ముందుగా ప్రవీణ్ దుంగతో భాగ్యశ్రీపై దాడి చేశాడు. అనంతరం ఆమెను ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేశాడు.
వివరాలు
దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు
ఉరితాడుకు వేలాడుతూ భాగ్యశ్రీ ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న సమయంలో ప్రవీణ్ ఆ దృశ్యాలను మొబైల్‌లో వీడియోగా రికార్డు చేశాడు.
ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి,తమ కుమార్తె చావుబతుకుల మధ్య ఉన్న దృశ్యాలను చూపించాడు.
అంతేకాకుండా ఆ వీడియోను పలువురు బంధువులు,స్నేహితులకు కూడా షేర్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో దంపతుల మధ్య గత కొంతకాలంగా తరచూ విభేదాలు,గొడవలు జరుగుతున్నట్లు తెలిసింది.
దీంతో భాగ్యశ్రీ రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఇకపై ఎలాంటి గొడవలు జరగవని, కలిసి ప్రశాంతంగా జీవిద్దామని నమ్మబలికి ప్రవీణ్ ఆమెను తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు.
అయితే, ఇంటికి వచ్చిన అదే రోజున ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
వివరాలు
అదుపులో నిందితుడు
సమాచారం అందుకున్న బిళగి పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.