Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ.. సిద్ధరామయ్య రాజీనామాపై హైడ్రామా
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో మంగళవారం ప్రారంభమైన కర్ణాటక రాజకీయ పరిణామాలు రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీ అధిష్ఠానం సూచనల నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేసే అవకాశాలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు బుధవారం ఉదయం నుంచే బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికార నివాసం 'కావేరి'కి చేరుకుని ఆయనను పదవిలో కొనసాగాలని కోరారు. అయితే తన నిర్ణయంలో మార్పు ఉండదని సిద్ధరామయ్య స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, గురువారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్న అల్పాహార సమావేశానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి కార్యాలయం మంత్రులందరికీ సమాచారం పంపింది.
వివరాలు
బెంగళూరుకు రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా
అదే రోజు ఉదయం 10.30 గంటలకు గవర్నర్‌ను కలిసేందుకు సమయం ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై రాజ్‌భవన్ నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. కాంగ్రెస్ కర్ణాటక వ్యవహారాల ఇన్‌ఛార్జి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నారు. మరోవైపు దిల్లీలో ఉన్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గురువారం నేరుగా ముఖ్యమంత్రి నిర్వహించే అల్పాహార సమావేశానికి హాజరవుతారని అధికారికంగా వెల్లడించారు.
వివరాలు
నాయకత్వ మార్పుపై చర్చ జరగలేదన్న సుర్జేవాలా
ఇక నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తలను రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఖండించారు. దిల్లీలో రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలపైనే చర్చ జరిగిందని, కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన తెలిపారు. మీడియాలో మాత్రమే ఈ తరహా ప్రచారం కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. రేపు, ఇరవై రోజుల తర్వాత లేదా ఆరు నెలల తర్వాత ఏమి జరుగుతుందో ఇప్పుడే ఎలా చెప్పగలమని ఆయన మీడియాను ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసం వద్ద అభిమానులు సంబరాలు జరిపారు. టపాసులు పేల్చి, స్వీట్లు పంచుతూ 'కొత్త ముఖ్యమంత్రి' అంటూ నినాదాలు చేశారు.
వివరాలు
సిద్ధరామయ్యను తప్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
మరోవైపు సిద్ధరామయ్య అభిమానులు రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన నివాసానికి చేరుకుని ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తే పార్టీకి నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. సిద్ధరామయ్యను తప్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కర్ణాటక అల్పసంఖ్యాక, వెనుకబడిన వర్గాలు, దళిత సంఘం అధ్యక్షుడు రామచంద్రప్ప హెచ్చరించారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయవద్దని కోరినా ఆయన స్పందించకుండా మౌనంగా ఉన్నారని మంత్రి హెచ్.కె. పాటిల్ వెల్లడించారు. మాజీ మంత్రి ఆర్.వి. దేశ్‌పాండే మాట్లాడుతూ సిద్ధరామయ్య రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, గురువారం ఆ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలిపారు. ఇదే సమయంలో డీకే శివకుమార్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కితే ఉప ముఖ్యమంత్రి పదవిపై పార్టీలో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి.
వివరాలు
అహింద నేతల సమావేశం
మంత్రి జమీర్ అహ్మద్ నివాసంలో అహింద నేతలు సమావేశమై తమ డిమాండ్లపై చర్చించినట్లు సమాచారం. కేపీసీసీ అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపుతున్న మంత్రి సతీశ్ జార్ఖిహొళి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నిర్వహించే అల్పాహార సమావేశంతో అసలు పరిస్థితి స్పష్టమవుతుందని వ్యాఖ్యానించారు.