Loading...
Karnataka: ఆర్‌ఎస్‌ఎస్‌ మార్చ్‌లో పాల్గొన్న ప్రభుత్వ టీచర్లు.. కర్ణాటక విద్యాశాఖ చర్య
ఆర్‌ఎస్‌ఎస్‌ మార్చ్‌లో పాల్గొన్న ప్రభుత్వ టీచర్లు.. కర్ణాటక విద్యాశాఖ చర్య

Karnataka: ఆర్‌ఎస్‌ఎస్‌ మార్చ్‌లో పాల్గొన్న ప్రభుత్వ టీచర్లు.. కర్ణాటక విద్యాశాఖ చర్య

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 28, 2026
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్‌ మార్చ్'లో పాల్గొన్న ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులపై విద్యాశాఖ సస్పెన్షన్‌ వేటు వేసింది. యాద్గిర్‌ జిల్లాకు చెందిన గురురాజ్‌ జోషి, అన్నా సాహెబ్‌ దేశ్‌ముఖ్‌లపై ఈ చర్య తీసుకుంది. ఈ వ్యవహారంపై శాఖాపరమైన విచారణ కూడా చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ఆగస్టు 20న ఉత్తర్వులు యాద్గిర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ చెన్నబసప్ప ముధోల్‌ ఈ మేరకు ఆగస్టు 20న ఉత్తర్వులు జారీ చేశారు. హునసగి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అసిస్టెంట్‌ టీచర్‌గా పనిచేస్తున్న గురురాజ్‌ జోషితో పాటు సుర్‌పూర్‌ తాలూకాలోని కుప్పి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అన్నా సాహెబ్‌ దేశ్‌ముఖ్‌పై చర్యలు తీసుకున్నారు.

వివరాలు 

ప్రభుత్వ ఉద్యోగులపై నిబంధనలు

కర్ణాటక సివిల్‌ సర్వీసెస్‌ (కండక్ట్‌) రూల్స్‌-2021లోని పలు నిబంధనలను ఇద్దరు ఉపాధ్యాయులు ఉల్లంఘించినట్లు విద్యాశాఖ పేర్కొంది.

ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది.

అంతేకాకుండా ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన బాధ్యత ఉందని అధికారులు పేర్కొన్నారు.

గురురాజ్‌ జోషిపై ఫిర్యాదు

2025 అక్టోబర్‌ 12న విజయపుర జిల్లాలోని తాళికోటలో నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్‌ పథసంచలనంలో గురురాజ్‌ జోషి పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు.

దీనికి సంబంధించిన ఫొటో విజయ కర్ణాటక పత్రికలో ప్రచురితమైంది.

ఈ విషయం వెలుగులోకి వచ్చిన అనంతరం అంబేడ్కర్‌ స్వాభిమాని సేన జిల్లా అధ్యక్షుడు జుమన్న గుడిమని ఫిర్యాదు చేశారు.

వివరాలు 

వివరణ ఇచ్చినా..

ఈ వ్యవహారంపై 2026 మార్చి 13న గురురాజ్‌ జోషికి విద్యాశాఖ షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.

అయితే మార్చ్ ఆదివారం నిర్వహించారని, తాను విధులు ముగిసిన తర్వాతే అందులో పాల్గొన్నానని జోషి తన వివరణలో తెలిపారు.

ఆ కార్యక్రమం రాజకీయపరమైనది కాదని, సాంస్కృతిక కార్యక్రమమని పేర్కొన్నారు. అయితే ఆయన ఇచ్చిన వివరణను విద్యాశాఖ అధికారులు తిరస్కరించారు.

ADVERTISEMENT

వివరాలు 

దేశ్‌ముఖ్‌ విషయంలోనూ ఇదే నిర్ణయం

అన్నా సాహెబ్‌ దేశ్‌ముఖ్‌ విషయంలోనూ విద్యాశాఖ ఇదే కారణాలను పేర్కొంది.

2025 అక్టోబర్‌ 10న హునసగిలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌ మార్చ్'లో ఆయన పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమం కూడా తన విధుల సమయంలో జరగలేదని, ఇది సాంస్కృతిక కార్యక్రమమని దేశ్‌ముఖ్‌ వివరణ ఇచ్చారు.

అయితే ఆయన వాదనను కూడా అధికారులు అంగీకరించలేదు. దీంతో ఇద్దరు ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ చర్యలు తీసుకోవడంతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

ADVERTISEMENT