Karnataka: కర్ణాటకలో మా ప్రభుత్వాన్ని కూలదోయాలనుకుంటోంది: సీఎం సిద్ధరామయ్య
కర్ణాటక (Karnataka)లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలదోయాలనుకుంటోందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ 'ఆపరేషన్ లోటస్' (operation Lotus) పేరుతో కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యేలను రూ.50కోట్లకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసిందని సిద్ధరామయ్య సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఇండియా టుడే (India Today) కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్తో చేసిన ఇంటర్వ్యూలో సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. సంవత్సర కాలంగా తమ పార్టీలోని ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లను ఆఫర్ చేసి బీజేపీ (Bjp)లోకి మారాల్సిందిగా ఆ పార్టీ ప్రయత్నించిందని సిద్ధరామయ్య తెలిపారు. కానీ, ఈ ప్రయత్నంలో వారు విఫలమయ్యారని ఆయన వెల్లడించారు.
ఒక్క ఎమ్మెల్యేను కూడా కొనలేదు: సిద్ధరామయ్య
తమ ప్రభుత్వంలోని ఒక్క ఎమ్మెల్యేను కూడా కొనడం బీజేపీకి సాధ్యపడదని, తమ పార్టీ నుంచి ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్లే ప్రసక్తిలేదని ఆయన స్పష్టం చేశారు. తన నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు రాష్ట్రాన్నిఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేసుకుంటుందని ఆయన తెలిపారు. కాగా, సిద్ధరామయ్య ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఎస్. ప్రకాష్ (S.Prakash) స్పందిస్తూ ఆయన చేసిన ఆరోపణలు అవాస్తమని తేల్చి చెప్పారు. ఒక ముఖ్యమంత్రి గా ఉండి ఇటువంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సిద్ధరామయ్య ఇటువంటి ఆరోపణలుచేసి సానుభూతితో తమ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలనుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని కీలక సమస్యలను గాలికొదిలి సిద్ధరామయ్య ఇటువంటి ఆరోపణలను బీజేపీపై చేస్తుండటం ప్రజలు గమనిస్తున్నారన్నారు.