Srikakulam: కాశీబుగ్గ తొక్కిసలాట విషాదం.. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందజేత
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన విషాదకర తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందజేసింది. ఒక్కొక్క కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పరిహార చెక్కులను కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా అందజేశారు. అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ ఘటన తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు పూర్తి సహాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
Details
25 మందికి పైగా గాయాలు
గత శనివారం కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన ఈ తొక్కిసలాటలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఎనిమిది మంది మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. ఇంకా 25 మందికి పైగా భక్తులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కార్తిక ఏకాదశి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు స్వామి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చారు. ఉదయం నుంచే భక్తుల రద్దీ అధికంగా ఉండగా, ఒకేసారి గుంపుగా లోనికి ప్రవేశించేందుకు ప్రయత్నించిన సమయంలో ఉదయం 11.45 గంటలకు తోపులాట జరిగి అది తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనతో ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.